![Virat Kohli Poor Form Continues Ahead Of Champions Trophy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Untitled-5.jpg.webp?itok=aryTu5As)
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్ట్ నుండి పేలవమైన ఫామ్ కారణంగా వైదొలిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత జరిగిన రంజీ ట్రోఫీ టోర్నమెంట్ లో కూడా ఆశించిన విధంగా రాణించలేక పోయాడు. ఈ నేపధ్యం లో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముందు రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడం చాల ముఖ్యమైన విషయం.
వరుసగా పది ఇన్నింగ్స్‌ల లో ( తొమ్మిది టెస్టులు, ఒక వన్డే) విఫలమైన రోహిత్ చివరికి ఆదివారం కటక్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించి సిక్సర్ల మోత మోగించాడు. రోహిత్ కటక్ ప్రేక్షకులను నిజంగా అలరించాడు, 12 ఫోర్లు మరియు 7 సిక్సర్లు తో వన్డేల్లో తన 32వ సెంచరీ సాధించి, భారత్ ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ చేజిక్కించుకునేందుకు తన వంతు పాత్ర పోషించాడు. జట్టు రధ సారధి లాగా ముందుండి నడిపించాడు.
ఈ సెంచరీతో, రోహిత్ 30 ఏళ్లు నిండిన క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా రికార్డ్ నమోదు చేసాడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో 35 సెంచరీలు తో చేసిన రికార్డును రోహిత్ అధిగమించాడు. భారత్ తరపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన వారి లో రోహిత్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా 15,404 పరుగులు సాధించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 15,335 పరుగులతో సాధించిన మరో రికార్డును కూడా రోహిత్ ఈ మ్యాచ్ తో అధిగమించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో ఈ జాబితా లో అగ్ర స్థానం లో ఉన్నాడు.
"చాలా సంవత్సరాలుగా నేను క్రికెట్ ఆడుతున్నాను. నేను ఏమి చేయాలో నాకు తెల్సు. నా నుండి ఏమి అవసరమో నాకు అర్థమైంది. పిచ్ లోకి వెళ్లి నేను చేసింది అదే" అని రోహిత్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడంతో భారత్ జట్టు మానేజిమెంట్ కి పెద్ద తలనొప్పి తగ్గింది. ఇక మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సెంచరి సాధించినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు భారత్ బ్యాటింగ్ గాడి లో పడినట్టే.
బ్యాటింగ్ స్థానం లో మార్పులు
అయితే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు పై పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు మేనేజిమెంట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కంటే ముందుగా పంపడం పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన రాహుల్ జట్టు అవసరాల అనుగుణంగా బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం పై జట్టు మేనేజిమెంట్ పలు విమర్శలు ఎదుర్కొంటోంది.
"అక్షర్ పటేల్ మళ్ళీ కెఎల్ రాహుల్ కంటే ముందుగా బ్యాటింగ్ రావడమేమిటి? నాకు మాటలు కూడా రావడం లేదు. రాహుల్ లాంటి నైపుణ్యమైన బాట్స్మన్ ని ఆరో స్థానానికి నెట్టడం చాల దారుణం. అక్షర్‌ను రాహుల్ కన్నా ముందుగా బ్యాటింగ్ పంపడం. అదీ ఇలాంటి పిచ్ పై సరైన నిర్ణయం కాదు, అని భారత్ మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment