ఇంగ్లండ్ తో గురువారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో నిజానికి భారత్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆడే పరిస్థితి లేదు. దానికి ముందు రోజు రాత్రి వరకు దీని పై స్పష్టత లేదు. శ్రేయాస్ అయ్యర్ ఏదో సినిమా చూస్తూ నిబ్బరముగా ఉన్నాడు. ఈ లోగా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయం కావడంతో అతను ఆడటం కష్టమని. అందువల్ల మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండమని కోరాడు. దాంతో సినిమా ఆపేసి మ్యాచ్ కి ముందు విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించాడు శ్రేయాస్ అయ్యర్. "విరాట్ మోకాలి నొప్పి కారణంగా ఆడే అవకాశం లేనందున నువ్వు ఆడే అవసరం రావచ్చు అని కెప్టెన్ (రోహిత్ శర్మ) నుండి నాకు కాల్ వచ్చింది" అని అయ్యర్ స్వయంగా వెల్లడించాడు.
"నేను నా గదికి తిరిగి వెళ్లి వెంటనే నిద్ర పోయాను." గురువారం మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి అడుగు పెట్టే సమయానికి భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో ఉంది. ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్ మరియు సాకిబ్ మహమూద్ నిలకడగా బౌలింగ్ చేస్తూ భారత్ ని పరుగులు కొట్టకుండా నిల్వరిస్తున్నారు.
ఆ దశలో రంగ ప్రవేశం చేసిన అయ్యర్ ఇంగ్లాండ్ బౌలర్ల సవాలును ఎదుర్కొన్నాడు. అయ్యర్ రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. తన అద్భుతమైన ఎదురుదాడి ఇన్నింగ్స్‌తో మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ఫలితంగా భారత్ తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా, శ్రేయాస్ అయ్యర్ తన 19వ అర్ధ సెంచరీతో రాణించాడు.
ఈ మ్యాచ్ లో మరో విషయం వెల్లడైంది. యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వస్తే శుభ్‌మాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉంటాడు. ఎడమచేతి వాటం అక్షర్ తదుపరి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది, ఆట స్థితిని బట్టి కే ఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా తర్వాత బ్యాటింగ్ చేస్తారు.
అయితే కోహ్లీ గాయం లేకపోతే అయ్యర్ కి స్తానం లేదా అన్నది ఇక్కడ ప్రధానాంశం. "కోహ్లీ ఫిట్ గా ఉంటే అయ్యర్ ఆడటం సాధ్యం కాదన్న విషయం గురుంచే నేను తదేకంగా ఆలోచిస్తున్నాను. 2023 ప్రపంచ కప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 500 కి పైగా పరుగులు చేసిన తొలి భారత్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.
అటువంటి నైపుణ్యం ఉన్న బ్యాట్స్మన్ ని మీరెలా బెంచ్ మీద కూర్చో బెట్ట గలరు? అని భారత్ మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా జట్టు మేనేజ్మెంట్ పై విరుచుకు పడ్డాడు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రేయాస్ అయ్యర్ ని సమర్ధించాడు.
"శ్రేయస్ తన నైపుణ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతను ప్రపంచ కప్‌లో పరుగుల ప్రవాహం సృష్టించాడు. ఒక ఆటగాడు ఇన్ని పరుగులు చేసినప్పుడు, అతనికి అవకాశాలు లభిస్తాయని భావించడంలో తప్పేం ఉంది. అతను అతని దృష్టిలో అత్యుత్తమ బ్యాట్స్మన్. అందుకే దేవుడు కూడా అలాగే భావించాడు. అతను చేసిన 50 పరుగులు, మ్యాచ్ రూపురేఖలను మార్చాయి," అని హర్భజన్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment