PC: IPL.com
IPL 2023 CSK vs MI: ఐపీఎల్-2023లో ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తీవ్ర నిరాశ పరుస్తుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శనివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ముంబై.. పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఇక సీఎస్‌కే చేతిలో ఘోర ఓటమిపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సీఎస్‌కే స్పిన్నర్లు తమను కోలుకోలేని దెబ్బ కొట్టారని రోహిత్ తెలిపాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ మాట్లాడుతూ.. "మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. అయితే మేము దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. పిచ్ బ్యాటింగ్‌కు చక్కగా అనుకూలించింది. అయితే మా ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో మేము వరుసక్రమంలో వికెట్లు కోల్పోయాం. 30-40 పరుగులు తక్కువగా చేశాం. అదే మా కొంపముంచింది. నిజం చెప్పాలంటే సీఎస్‌కే స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు బాగా బౌలింగ్ చేసి మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. అటువంటి సమయంలో బౌలర్లపై ఎదురుదాడికి దిగాలంటే చాలా ధైర్యం కావాలి.
కానీ మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి అంత అనుభవం లేదు. వారు అద్భుతంగా రాణించాలంటే కొంత సమయం పడుతుంది. మా జట్టులో యంగ్ క్రికెటర్లకు చాలా ప్రతిభ ఉంది. కాబట్టి మా జట్టు ఎల్లప్పుడూ వారికి మద్దతుగా ఉంటుంది. అయితే కొంతమంది సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉంటే బాగుండేదనిపిస్తుంది.
ఇక ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. కానీ దురదృష్టవశాత్తూ మేము రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయాం. అయితే రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైనంత మాత్రాన టోర్నీ నుంచి ఔట్ అయినట్లు కాదు. మేము తర్వాతి మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచేందుకు ప్రయత్నిస్తాం" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఏంటి బ్రో ఇది.. 17 కోట్లు తీసుకున్నావు! ఈ చెత్త ఆటకేనా?
Comments
Please login to add a commentAdd a comment