సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజీ అయిన పార్ల్ రాయల్స్ చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో 20 ఓవర్లను స్పిన్నర్లతో వేయించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. శనివారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఐదుగురు స్పిన్నర్లను ప్రయోగించింది. ఫోర్టుయిన్, వెల్లలగే, ముజీబ్,ఎన్ పీటర్, రూట్ తలో నాలుగు ఓవర్లు వేశారు. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్ జో రూట్ అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. రూట్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఆఖర్లో కెప్టెన్ డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
మిల్లర్ 18 బంతుల్లో బౌండరీ, 2 సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. రాయల్స్ ఆటగాళ్లలో ప్రిటోరియస్ (0), రూబిన్ హెర్మన్ (9), వాన్ బుర్రెన్ (5), దునిత్ వెల్లలగే (15) నిరాశపరిచారు. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్, ఈథన్ బాష్, సెనూరన్ ముత్తుస్వామి, కైల్ సైమండ్స్ తలో వికెట్ పడగొట్టారు.
141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాపిటల్స్ రాయల్స్ బౌలర్లు రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ విల్ జాక్స్ అర్ద సెంచరీతో రాణించాడు. 53 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. కైల్ వెర్రిన్ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు.
క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో జాక్స్, వెర్రిన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. రహ్మానుల్లా గుర్బాజ్ 6, మార్కస్ ఆకెర్‌మ్యాన్ 2, రిలీ రొస్సో 4, జేమ్స్ నీషమ్ 1, కీగన్ లయన్ 2 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో ఫోర్టుయిన్, ముజీబ్ రెహ్మాన్, జో రూట్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వెల్లలగే ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో భీకరఫామ్‌లో ఉన్న రూట్ బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment