సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ రెండో విజయం నమోదు చేసింది. పార్ల్ రాయల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించాడు. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్ చేశాడు.
ఆఖర్లో డెలానో పాట్‌గెటర్ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేప్‌టౌన్ ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ 8, కొలిన్ ఇంగ్రామ్ 7, జార్జ్ లిండే 1, జూనియర్ ఏబీడి 14, అజ్మతుల్లా 2 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో గాలిమ్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్, మఫాకా, ముజీబ్ ఉర్ రెహ్మన్, లుంగి ఎంగిడి తలో వికెట్ దక్కించుకున్నారు.
173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు డ్రి ప్రిటోరియస్ (26), జో రూట్ (26), వన్‌డౌన్ బ్యాటర్ సామ్ హెయిన్ (20), ముజీబ్ రెహ్మాన్ (34), మఫాకా (22 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ లీగ్‌లో ఆడుతున్న ఏకైక భారతీయుడు దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమయ్యాడు. డీకే 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (1) కూడా నిరాశపరిచాడు.
ఎంఐ బౌలర్లలో జార్జ్ లిండే 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రబాడ అద్భుతమైన స్పెల్ వేశాడు. తొలి రెండు ఓవర్లను మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేసిన రబాడకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment