సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) పార్ల్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో నిన్న (జనవరి 20) జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాయల్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. రాయల్స్ చేతిలో ఓడిన సూపర్ కింగ్స్ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన ఎంఐ కేప్‌టౌన్ రెండో స్థానంలో ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది జానీ బెయిర్‌స్టో పుణ్యమే. బెయిర్‌స్టో 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. ఆఖర్లో డొనొవన్ ఫెరియెరా (19 బంతుల్లో 32 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాయల్స్ బౌలర్లలో ఫోర్టుయిన్ 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ 19.1 ఓవర్లలో ఛేదించింది. మిచెల్ వాన్ బెర్రెన్ (44), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (40 నాటౌట్) రాణించి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డ్రి ప్రిటోరియస్ 27 పరుగులు చేయగా.. జో రూట్ 6, రూబిన్ హెర్మన్ 19 పరుగులకు ఔటయ్యారు. మిల్లర్‌కు జతగా దినేశ్ కార్తీక్ (2) అజేయంగా నిలిచాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో హర్డస్ సిపామ్లా 2, ఇమ్రాన్ తాహిర్, ఫెరియెరా తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment