
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ తేడాతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన ఢిల్లీని ఆశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మార్ష్, పూరన్ మినహా లక్నో ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు.
వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు లక్నో 250 పైచిలుకు పరుగులు సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే మార్ష్, పూరన్ ఔటయ్యాక ఆ జట్టు మిడిలార్డర్ అనూహ్యంగా కుప్పకూలింది. రిషబ్ పంత్ 6 బంతుల్లో డకౌట్ కాగా.. ఆయుశ్ బదోని 4, శార్దూల్ ఠాకూర్ 0, షాబాజ్ అహ్మద్ 9, బిష్ణోయ్ 0 పరుగులకు ఔటయ్యారు. చివరి ఓవర్‌లో డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రెండు సిక్సర్లు బాదడంతో లక్నో 200 పరుగుల మార్కును దాటింది. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 3, కుల్దీప్ 2, విప్రాజ్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీశారు.
అనంతరం 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది. ఈ దశలో అశుతోష్ అద్భుతం చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ (22 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ సాయంతో ఢిల్లీకి ఊహించని విజయాన్నందించాడు.
చివరి ఓవర్ మూడో బంతికి సిక్సర్ కొట్టి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ (29), అక్షర్ పటేల్ (22) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతా వారంతా సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. లక్నో బౌలరల్లో శార్దూల్ ఠాకూర్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ రతీ, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు తీశారు.
కాగా, ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆ జట్టు ఓటమికి ప్రత్యక్ష కారకుడయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 6 బంతులు ఆడి డకౌటైన పంత్.. ఛేదనలో (ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయిన దశలో) చివరి ఓవర్ తొలి బంతికి స్టంపింగ్ మిస్ చేసి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్‌ను వదిలేశాడు. పంత్ ఈ స్టంపింగ్ చేసుంటే లక్నో మ్యాచ్ గెలిచేది.
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పంత్ ఇలా అన్నాడు. మా టాపార్డర్ బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ఈ వికెట్‌పై ఇది చాలా మంచి స్కోర్. దురదృష్టవశాత్తు మేము ఆ స్కోర్‌ను కాపాడుకోలేకపోయాము. మేము ప్రారంభంలో వికెట్లు తీసినప్పటికీ.. ఇది బ్యాటింగ్ చేయడానికి మంచి వికెట్ అని తెలుసు. వారు (ఢిల్లీ) రెండు మంచి భాగస్వామ్యాలు (స్టబ్స్‌తో, విప్రాజ్ నిగమ్‌తో అశుతోష్) నెలకొల్పారు. విప్రాజ్ నిగమ్ చాలా బాగా ఆడాడు. అతడే మా నుంచి మ్యాచ్‌ను దూరం చేశాడు.
బౌలర్లకు ఈ పిచ్‌పై తగినంత ఉంది. కానీ మేము కొన్ని బేసిక్స్ మిస్ అయ్యాము. చివర్లో ఒత్తిడికి లోనయ్యాము. ఇది ఇంకా తొలి మ్యాచే. ఓటమిని అధిగమించి ట్రాక్‌లో పడతాము. ఈ మ్యాచ్ నుండి తీసుకోవలసిన సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఆటలో అదృష్టం కీలక పాత్ర పోషిస్తుంది. స్టంపింగ్ మిస్‌పై స్పందిస్తూ.. బంతి మోహిత్ ప్యాడ్‌లకు తాకకపోయుంటే స్టంపింగ్‌కు అవకాశం ఉండేది. క్రికెట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటినే పట్టించుకుంటూ పోతే ఆటపై దృష్టి పెట్టలేము.