బుమ్రా కంటే ‘ఎక్కువే’.. కానీ  | Sandeep Sharma Better Than Jasprit Bumrah? | Sakshi
Sakshi News home page

బుమ్రా కంటే ‘ఎక్కువే’.. కానీ 

Published Thu, Nov 5 2020 8:49 PM | Last Updated on Thu, Nov 5 2020 8:57 PM

Sandeep Sharma Better Than Jasprit Bumrah? - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత గుర్తింపు పొందిన బౌలర్లలో సన్‌రైజర్స్‌ పేసర్‌ సందీప్‌ శర్మ ఒకడు. మొత్తం 11 మ్యాచ్‌లకు గాను 13 వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా 44 ఓవర్లు వేసి 323 పరుగులిచ్చాడు. దాంతో అతని ఎకానమీ 7.34గా నమోదైంది. ఈ సీజన్‌ అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన ఆరో బౌలర్‌గా సందీప్‌ కొనసాగుతున్నాడు ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లిని ఏడోసారి ఔట్‌ చేసిన రికార్డును సందీప్‌ సాధించాడు. దాంతో ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లిని అత్యధిక సార్లు ఔట్‌ చేసిన రికార్డును సందీప్‌ తన పేరిట లిఖించుకున్నాడు.. సందీప్‌ శర్మ తనకు వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ ముందుకు వెళుతున్నా అతనికి రావాల్సిన పేరు రాలేదు. టీమిండియా జట్టులో సందీప్‌ తక్కువ అంచనా వేయబడ్డాడు అనే మాట ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అది నిజమేనని అతని బౌలింగ్‌ గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. ఆరెంజ్ ఆర్మీ ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో దూరమవడంతో అవకాశం అదుకున్న సందీప్.. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు.ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సందీప్ చెలరేగాడు. రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్, ఇషాన్ కిషాన్‌లను ఔట్ చేసిన విధానం శభాష్‌ అనిపించింది. ఇందులో వరుస సిక్సర్లతో దూకుడు కనబర్చిన డీకాక్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.    

ఈ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన సందీప్ శర్మ.. టీమిండియా యార్కర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీయడం, ఐపీఎల్ కెరీర్ గణంకాలు కూడా ఇద్దరివి దాదాపు దగ్గరగా ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఇన్నాళ్లు సందీప్‌ను సరిగా  గుర్తించలేదా? అనే సందేహం కలుగుతుంది. ఇక బుమ్రా, సందీప్ ఒకే ఏడాది 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేయగా.. ఇప్పటి వరకు ఇద్దరూ 90 మ్యాచ్‌లు ఆడారు. సందీప్ 24.02 సగటు, 7.75 ఎకానమీతో 108 వికెట్లు తీయగా.. బుమ్రా కూడా 24.22 సగటు 7.46 ఎకానమీతో 105 వికెట్లు మాత్రం తీసాడు. ఇక సందీప్ స్ట్రైక్ రేట్ 18.6 ఉండగా.. బుమ్రాది 19.4 ఉంది. ఇద్దరి గణాంకాలు సరిసమానంగా ఉన్నప్పటికీ  పేరు విషయంలో బుమ్రా కంటే చాలా దూరంలో ఉన్నాడు సందీప్‌. బుమ్రా జాతీయ జట్టులో ప్రధాన బౌలర్‌గా మారిపోతే సందీప్‌ మాత్రం కేవలం రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. సందీప్‌ బౌలింగ్‌లో తగినంత పేస్‌ లేకపోవడమే అతన్నిపరిగణలోకి తీసుకోలేకపోవడనాకి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.  స్లో బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడే సందీప్‌.. అందరి దృష్టిని ఆకర్షించడంలో విఫలమవుతున్నాడని వారి అభిప్రాయం. సందీప్‌ తన కెరీర్‌లో 2015లో  అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసి రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఆపై అతనికి మళ్లీ అవకాశం దక్కలేదు.ఈ ఐపీఎల్‌ అయినా సందీప్‌ రీఎంట్రీకి దోహదం చేస్తుందో లేదో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement