టీమిండియా స్టార్ రిషభ్ పంత్(Rishabh Pant)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వికెట్ కీపింగ్ విషయంలో ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్.. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అంతటి స్థాయికి చేరుకున్నాడని ప్రశంసించాడు.
అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం పంత్ కంటే.. సంజూ శాంసన్ బెటర్ అని పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టులో వికెట్ కీపర్ కోటాలో తాను సంజూకే ఓటువేస్తానని కైఫ్ స్పష్టం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ తనను దాటుకుని ముందుకు వెళ్లాడన్న నిజాన్ని రిషభ్ పంత్ అంగీకరించాలి.
వికెట్ కీపర్‌గా పంత్ సూపర్
నిజానికి రిషభ్ పంత్ అంటే అభిమానులకు ఓ ఎమోషన్. టెస్టుల్లో అతడొక మ్యాచ్ విన్నర్. ఆస్ట్రేలియాతో గబ్బా మైదానంలో.. అదే విధంగా సౌతాఫ్రికాపై టెస్టులో అతడు ఆడిన ఇన్నింగ్స్‌ను ఎవరు మాత్రం మర్చిపోగలరు? ముఖ్యంగా విదేశీ గడ్డపై అతడు అద్భుత ప్రదర్శన కనబరచగలడు.
మంచి వికెట్ కీపర్ కూడా!.. వికెట్ కీపింగ్ విషయంలో సంజూ శాంసన్ కంటే పంత్ మెరుగు. అతడు దాదాపుగా ఎంఎస్ ధోని స్థాయికి చేరుకున్నాడు.
ఇక్కడ మాత్రం సంజూనే బెటర్
కానీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన గణాంకాలు ఎలా ఉన్నాయో పంత్ ఓసారి గమనించుకోవాలి. ఇతరులు చెప్పిన మాటలు పట్టించుకోకుండా.. తనకు తానుగా విశ్లేషణ చేసుకోవాలి.
చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దొరక్కపోతే.. అది పంత్‌కు అన్యాయం జరిగినట్లు కాదు. సంజూ శాంసన్‌కు ఈ టీమ్‌లో చోటు దక్కించుకునే అర్హత ఉంది. ఈ ఇద్దరినీ పోల్చినపుడు పంత్ కంటే సంజూనే బెటర్’’ అని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.
పంత్ వర్సెస్ సంజూ - గణాంకాలు
కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే భారత జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సంజూ శాంసన్ రేసులో ఉన్నారు. అయితే, వన్డేల్లో పంత్ గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేవు. ఇప్పటి వరకు 31 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 33.5 సగటుతో 871 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది.
మరోవైపు.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ 16 మ్యాచ్‌లలో 56.66 సగటుతో 510 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక టీ20లలోనూ సంజూ శాంసన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. రెండు శతకాలతో చెలరేగాడు.
గావస్కర్ ఓటు కూడా సంజూకే
ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ సంజూ శాంసన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు.. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ సైతం సంజూ వైపే మొగ్గుచూపాడు. అతడిని ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment