IPL 2026: ముగ్గురు మొనగాళ్లు! | Seniors Rohit-Kohli-Rahane Stunning Batting In Their 1st Matches IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!

Mar 30 2026 8:58 AM | Updated on Mar 30 2026 10:29 AM

Seniors Rohit-Kohli-Rahane Stunning Batting In Their 1st Matches IPL 2026

Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై రెండు రోజులే అయినప్పటికీ రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలవడం అభిమానులకు కిక్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ కిక్ ఇస్తున్న వార్త ఏదైనా ఉందంటే.. టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ అని చెప్పొచ్చు. 40 ఏండ్లకు దగ్గర్లో ఉన్న ఈ ముగ్గురు మొనగాళ్లు బ్యాటింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు. 

ఈ సీజన్‌లో  తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ త్రయం తమ ప్రదర్శనతో అదరగొట్టారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్‌, కోహ్లీలు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితే.. జట్టులో అవకాశాల్లేక టీ20 క్రికెట్ ఆడే అవకాశం రహానే ఎప్పుడో కోల్పోయాడు. కానీ తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 19వ సీజన్‌లో మాత్రం తమ బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ముగ్గురూ ఇలాగే ఆడుతూ పోతే రాబోయే మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే అని చెప్పొచ్చు.

రోహిత్ శర్మ..
భారత కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచకప్‌ను అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ జనవరిలో న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్స్ లేదు. 

మూడు వ‌న్డేలు క‌లిపి కేవ‌లం 61 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. కానీ ఇవాళ ఐపీఎల్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే రోహిత్ శ‌ర్మ విధ్వంస‌క‌ర ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 78 ప‌రుగులు చేసిన రోహిత్‌ అల‌వోక‌గా బంతుల‌ను బౌండ‌రీ అవ‌త‌ల‌కు పంపిస్తూ పాత హిట్‌మ్యాన్‌ను  గుర్తు చేశాడు. 

రికిల్‌ట‌న్ కంటే ముందే ఔటైన‌ప్ప‌టికీ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో కేకేఆర్‌కు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ముఖ్యంగా మ్యాచ్‌లో రోహిత్ ఫుట్‌వ‌ర్క్ అద్భుతమ‌ని చెప్పొచ్చు. ఎక్క‌డా చిన్న త‌ప్పిదం లేకుండా ఇన్నింగ్స్ ఆసాంతం మంచి టైమింగ్‌తో షాట్లు ఆడాడు. తొలి మ్యాచ్‌తోనే ఫామ్ అందుకున్న రోహిత్ నుంచి సీజ‌న్ ముగిసేలోపు మ‌రిన్ని  అద్భుత ఇన్నింగ్స్‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.


విరాట్ కోహ్లీ..
కోహ్లీది కూడా అచ్చం రోహిత్ స్టోరీనే. 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన టీమిండియాలో స‌భ్యుడైన కోహ్లీ రోహిత్‌తో క‌లిసి ఏక‌కాలంలో టీ20ల‌కు వీడ్కోలు ప‌లికాడు. ఆ త‌ర్వాత జ‌న‌వ‌రిలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లోనూ కోహ్లీ అద‌ర‌గొట్టాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ 3 మ్యాచ్‌ల్లో 240 ప‌రుగులు సాధించి భార‌త్ త‌ర‌ఫున టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 

తాజాగా అదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కంటిన్యూ చేశాడు. ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన ఆరంభ మ్యాచ్‌లో బెంగ‌ళూరు స్టార్ కోహ్లీ చివ‌రి వ‌ర‌కు నాటౌట్‌గా నిలిచి జ‌ట్టును గెలిపించాడు. కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్‌) చేజింగ్‌లో త‌న‌ను కొట్టేవారు లేర‌ని మ‌రోసారి నిరూపించాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు ఉన్నాయి. సీజ‌న్ ఆద్యంతం కోహ్లీ ఇదే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే ఆరెంజ్ క్యాప్ కూడా సొంయ్యే అవకాశం లేకపోలేదు.

అజింక్యా ర‌హానే..
రోహిత్‌, కోహ్లీలు రెండేళ్ల కింద‌ట టీ20ల‌కు వీడ్కోలు ప‌లికితే ర‌హానే టీమిండియా త‌ర‌ఫున త‌న చివ‌రి టీ20 ఆడి దాదాపు ప‌దేళ్లు కావొస్తోంది. ర‌హానే 2016లో వెస్టిండీస్‌తో చివ‌రి టీ20 ఆడాడు. అప్ప‌టి నుంచి టెస్టుల్లో కొన్నాళ్లు ఆడిన ర‌హానే ఇప్పుడు అవ‌కాశాలు లేవు. దీంతో ఐపీఎల్‌లో మాత్ర‌మే కొన‌సాగుతున్న ర‌హానే గ‌త రెండు, మూడు సీజ‌న్లలో ఆట స్వ‌రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. 

ర‌హానేను ఎక్కువ‌గా టెస్టు క్రికెట్‌లో చూడ‌డం వ‌ల్ల అత‌డి నుంచి నెమ్మ‌దైన ఆట‌నే అభిమానులు ఊహించేవారు. కానీ ఐపీఎల్‌లో ర‌హానే ఆడుతున్న తీరు షాక్ క‌లిగిస్తోంద‌ని చెప్పొచ్చు. తాజాగా ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో ర‌హానే కేకేఆర్ కెప్టెన్‌గా కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 67 ప‌రుగులు చేసిన ర‌హానే ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు ఉన్నాయి. 

గ‌తంలో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌కు ఆడిన‌ప్పుడు కూడా ర‌హానే ఇదే దూకుడును ప్ర‌ద‌ర్శించి స‌రికొత్త ఆట‌ను రుచి చూపించాడు. మొత్తంగా టీమిండియా సీనియ‌ర్ల‌యిన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, అజింక్యా ర‌హానేలు ఒక్క మ్యాచ్‌తోనే ఆట‌లో మొన‌గాళ్ల‌మ‌ని నిరూపించుకున్నారు.

చదవండి: ‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’

Advertisement
 
Advertisement
Advertisement