
దుబాయ్: షాహిద్ అఫ్రిది.. బంతిని ఎంత బలంగా బాదుతాడో .. కోపాన్ని కూడా అంతే వేగంగా చూపిస్తాడు. ఎదుటివారు తప్పు చేసినా.. తాను తప్పు చేసినా అసహనం వ్యక్తం చేయడం అఫ్రిదికి ఉన్న అలవాటు. ఆ అలవాటే అతన్ని చాలాసార్లు ఇబ్బందులు పెట్టింది.. ఒక్కోసారి నవ్వులు కూడా పూయించింది. రెండేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్రిది ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో క్యులాండర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుక్రవారం టీమ్ అబుదాబితో ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు మరింత దగ్గరవుతుంది. దీంతో సిరీయస్‌గా తీసుకున్న ఇరుజట్లు మ్యాచ్‌ను గెలవడానికి ప్రయత్నించాయి.
మ్యాచ్ ఫలితం పక్కనపెడితే.. క్యులాండర్ బ్యాటింగ్ సమయంలో అఫ్రిది చర్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆఫ్‌స్టంప్ మీదుగా వెళుతున్న బంతిని అఫ్రిది పుష్ చేయాలని చూశాడు. కానీ బంతి బ్యాట్ పైనుంచి వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. దీంతో అతను వింతైన ఎక్స్‌ప్రెషన్ పెట్టి పంజాబీ భాషలో 'ఓ తెరీ కైయిర్' అనే పదం ఉపయోగించాడు. ఓ తెరీ కైయిర్ అంటే ఓ మై గాడ్ అని అర్థం. అఫ్రిది పలికిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాకిస్తాన్‌కు 22ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన షాహిద్ అఫ్రిది అనతికాలంలోనే మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందాడు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ(37 బంతుల్లో 100 పరుగులు) చేసిన తొలి ఆటగాడిగా అఫ్రిది రికార్డులకెక్కాడు. పాక్ తరపున 27 టెస్టుల్లో 1716 పరుగులు, 398 వన్డేల్లో 8064 పరుగులు, 99 టీ20ల్లో 1416 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో వన్డేల్లో 395 వికెట్లు, టెస్టుల్లో 48 వికెట్లు, టీ20ల్లో 98 వికెట్లు తీశాడు.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన క్యులాండర్స్ 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఆఫ్రిది 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్ అబుదాబి 8.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. బెన్ డక్కెట్ 27, జో క్లార్క్ 22 పరుగులు చేశారు.
చదవండి:
సిరాజ్, కుల్దీప్‌ల గొడవ.. నిజమెంత!
కోహ్లి ఫిజియో అవతారం.. చూసి తీరాల్సిందే
Shahid Afridi "oh teri khair" #T10League #Cricket pic.twitter.com/zXL3E5DkoT
— Saj Sadiq (@Saj_PakPassion) February 5, 2021