మహ్మద్ షమీ- సంజయ్ మంజ్రేకర్ (PC: BCCI)
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మండిపడ్డాడు. ఇతరుల కోసం జ్ఞానం వృథా చేసుకుని.. తమ గురించి ఆలోచించుకోవడం మర్చిపోవద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జోస్యం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుంటే బాబా అవతారం ఎత్తితే బాగుంటుందంటూ చురకలు అంటించాడు.
నవంబరు 24, 25 తేదీల్లో
ఐపీఎల్-2025 మెగా వేలం నవంబరు 24, 25 తేదీల్లో జరుగనున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరిగే వేలంపాటకు ముందే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి.
ఆ ఐదుగురు మాత్రమే
ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్(రూ. 18 కోట్లు ), శుబ్‌మన్ గిల్(రూ. 16.50 కోట్లు), సాయి సుదర్శన్(రూ. 8.50 కోట్లు), రాహుల్ తెవాటియా(రూ. 4 కోట్లు), షారుఖ్ ఖాన్(రూ. 4 కోట్లు)లను మాత్రమే అట్టిపెట్టుకుని.. షమీని విడిచిపెట్టింది.
ఏడాది తర్వాత రీ ఎంట్రీ
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన షమీ.. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయిన షమీ దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. బాల్‌తోనే గాకుండా బ్యాట్‌తోనూ సత్తా చాటాడు.
షమీ ధర పడిపోవచ్చు
ఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందు షమీని ఉద్దేశించి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘షమీపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేమం లేదు. కానీ.. అతడిని గాయాల బెడద వేధిస్తోందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
అతడు కోలుకోవడానికి ఎంత సమయం పట్టిందో మనం చూశాం. కాబట్టి ఇలాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలంటే.. ఫ్రాంఛైజీలు కాస్త ఆలోచిస్తాయి. ఒకవేళ ఎవరైనా షమీపై భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత.. మధ్యలోనే అతడు జట్టుకు దూరమైతే..వారికి సరైన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండవు. అందుకే.. షమీ ధర పడిపోవచ్చు’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
బాబాజీని సంప్రదించండి
ఇందుకు ఘాటుగా స్పందించిన షమీ ఇన్‌స్టా స్టోరీలో మంజ్రేకర్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ.. ‘‘బాబాకీ జై! మీ భవిష్యత్తు కోసం కూడా కాస్త జ్ఞానాన్ని దాచిపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే బాబాజీని సంప్రదించండి’’ అంటూ సెటైర్లు వేశాడు.
రూ. 6.25 కోట్లకు కొనుగోలు
కాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ షమీని రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఎడిషన్‌లో షమీ 16 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో.. రిషభ్ పంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
డబ్బు విషయంలో సయోధ్య కుదరకపోవడంతోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టాడని సన్నీ అంచనా వేశాడు. అయితే, పంత్ ఎక్స్ వేదికగా గావస్కర్ వ్యాఖ్యలను ఖండించాడు. తాజాగా షమీ సైతం అదే పంథాను అనుసరించాడు.
చదవండి: IPL 2025 Mega Auction: అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!
పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment