భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్ 357/5
రాణించిన ఇంద్రజీత్
భారత్ ‘బి’తో దులీప్ ట్రోఫీ మ్యాచ్
సాక్షి, అనంతపురం: యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (126 బంతుల్లో 111; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అనంతపురంలో భారత్ ‘బి’ జట్టుతో గురువారం మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘సి’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ శతక్కొట్టగా... మిగతా బ్యాటర్లు కూడా విలువైన పరుగులు చేయడంతో భారత్ ‘సి’ జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 46 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాయి సుదర్శన్ (75 బంతుల్లో 43; 8 ఫోర్లు), రజత్ పాటిదార్ (67 బంతుల్లో 40; 8 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (136 బంతుల్లో 78; 9 ఫోర్లు) రాణించారు. మ్యాచ్ ఆరంభంలో రెండు బంతులు ఎదుర్కోగానే మడమ నొప్పితో మైదానాన్ని వీడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్... కోలుకొని తిరిగి క్రీజులో అడుగు పెట్టి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మానవ్ సుతార్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయిన ఇషాన్ కిషన్... రెండో రౌండ్ మ్యాచ్‌లో చక్కటి ఆటతీరు కనబర్చాడు. ఇంద్రజిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 189 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్‌లో జార్ఖండ్ తరఫున సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్... ఇక్కడే అదే జోరు కొనసాగించాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా... నవ్‌దీప్ సైనీ, రాహుల్ చహర్ చెరో వికెట్ తీశారు.
స్కోరు వివరాలు
భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (బ్యాటింగ్) 46; సాయి సుదర్శన్ (సి) నవ్‌దీప్ సైనీ (బి) ముకేశ్ కుమార్ 43; రజత్ పాటిదార్ (బి) నవ్‌దీప్ సైనీ 40; ఇషాన్ కిషన్ (బి) ముకేశ్ కుమార్ 111; బాబా ఇంద్రజిత్ (బి) రాహుల్ చాహర్ 78; అభిషేక్ పొరేల్ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్ కుమార్ 12; మానవ్ సుతార్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (79 ఓవర్లలో 5 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345. బౌలింగ్: ముకేశ్ కుమార్ 21–3–76–3; నవ్‌దీప్ సైనీ 17–2–78–1; వాషింగ్టన్ సుందర్ 10–0–55–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–2–58–0; సాయికిశోర్ 12–0–46–0; రాహుల్ చహర్ 5–0–35–1.
Comments
Please login to add a commentAdd a comment