టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండోసారి తండ్రి అయ్యాడు. దూబే భార్య అంజుమ్ ఖాన్ నిన్న (జనవరి 3) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన విషయాన్ని దూబే ఇవాళ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశాడు. మేము 4 మంది కుటుంబంగా మారడంతో మా హృదయాలు పెద్దవిగా మారాయి. మెహ్విష్ శివమ్ దూబేకు స్వాగతం అంటూ దూబే తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు.
31 ఏళ్ల దూబేకు 2021 జులై 16న అంజుమ్ ఖాన్‌తో వివాహమైంది. వీరికి 2022 ఫిబ్రవరి 13న బాబు జన్మించాడు. బాబుకు అయ్యాన్ దూబే అని పేరు పెట్టారు.
దూబే క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 80 పరుగులు చేసి ఓ వికెట్ తీసుకున్నాడు.
దూబే.. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో దూబే ఐదు మ్యాచ్‌లు ఆడి 75.50 సగటున 151 పరుగులు చేశాడు. సర్వీసెస్‌పై దూబే మ్యాచ్ విన్నింగ్ నాక్ (71 నాటౌట్) ఆడాడు.
వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు
2019 నవంబర్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మెగా టోర్నీలో దూబే ప్రతి మ్యాచ్ ఆడాడు. ఆ టోర్నీలో దూబే ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 22.16 సగటున 133 పరుగులు చేశాడు.
సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లో 27 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ను సాధించడం అది రెండోసారి.
దూబే టీమిండియా తరఫున 33 టీ20లు ఆడి 29.86 సగటున 448 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన దూబే 11 వికెట్లు కూడా తీశాడు. టీమిండియా తరఫున నాలుగు వన్డేలు కూడా ఆడిన దూబే 43 పరుగులు చేసి ఓ వికెట్ పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment