‘నాపై కక్ష కట్టారు’.. శ్రేయ‌స్ అయ్యర్‌ సోద‌రి ఆవేదన! | Shreyas Iyer Sister Shresta Hits Back At Trolls Don't Target Families | Sakshi
Sakshi News home page

‘నాపై కక్ష కట్టారు’.. శ్రేయ‌స్ అయ్యర్‌ సోద‌రి ఆవేదన!

May 26 2026 7:55 AM | Updated on May 26 2026 12:54 PM

Shreyas Iyer Sister Shresta Hits Back At Trolls Don't Target Families

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ ప్ర‌యాణం ఒక విషాద‌గాథ అని చెప్పొచ్చు. సీజ‌న్ తొలి ద‌శ పోటీల్లో ఓట‌మి ఎరుగ‌ని పంజాబ్ టేబుల్ టాప‌ర్‌గా నిలిచింది. అయితే రెండో ద‌శ పోటీల‌కు వ‌చ్చేస‌రికి పంజాబ్ క‌థ అడ్డం తిరిగింది. వ‌రుస‌గా ఆరు ప‌రాజ‌యాలు ఆ జ‌ట్టును ఇవాళ ప్లేఆఫ్స్‌కు చేర‌కుండా అడ్డుకున్నాయి. చివ‌రి లీగ్ మ్యాచ్‌లో గెలిచినప్ప‌టికీ ముంబై ఇండియ‌న్స్‌ఫై రాజ‌స్తాన్ రాయల్స్ గెల‌వ‌డంతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్ల‌యింది. 

ఈ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే పంజాబ్‌ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సోద‌రి శ్రేష్ట అయ్య‌ర్ ఒక వీడియోను విడుద‌ల చేసింది. శ్రేష్ట ఉన్న‌ప‌ళంగా వీడియో రిలీజ్ చేయ‌డం వెనుక ఒక కార‌ణ‌ముంది. అదేంటంటే.. సీజ‌న్ ఆరంభంలో పంజాబ్‌, కేకేఆర్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణ‌మైంది. దీంతో ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయించారు. ఈ స‌మ‌యంలో అయ్య‌ర్ సోద‌రి శ్రేష్ట పంజాబ్ జెర్సీ ధ‌రించి ఒక వీడియో రిలీజ్ చేసింది. 

'మేము పంజాబీలం. మా మన‌సు చాలా పెద్ద‌ది. అందుకే మీకు ఒక పాయింట్ ఇచ్చాము' అని స‌ర‌దాగా కేకేఆర్‌ను ట్రోల్ చేసింది. అయితే శ్రేష్ట మాట‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న కేకేఆర్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. అప్పుడు మొద‌లైన ట్రోలింగ్ యుద్ధం త‌న‌పై ఇప్ప‌టిదాకా కొన‌సాగుతూనే ఉందంటూ శ్రేష్ట అయ్య‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. 

ఈ నేప‌థ్యంలో త‌న‌కు ఎవ‌రిని కించ‌ప‌రిచే ఉద్దేశం లేద‌ని, కేవ‌లం స‌ర‌దా కోస‌మే వీడియోలు పోస్ట్ చేస్తున్న‌ట్లు శ్రేష్ట‌ తెలిపింది. 'నేను వీడియోలు పెట్ట‌డం వెనుక అస‌లు ఉద్దేశం కేవ‌లం ఫ‌న్ మాత్ర‌మే. నేను ఎవ‌రిని ట్రోలింగ్ చేయాల‌నుకోవ‌డం లేదు. ఎవరి మీద నాకు అలాంటి దురుద్దేశం లేదు. 

ప్ర‌తీ క్రికెట‌ర్‌ను గౌర‌విస్తాను.. ఎందుకంటే నా సోదరుడు కూడా ఒక క్రికెట‌రే. కానీ మీరు మాత్రం నేను చేసిన చిన్న తప్పుకు నాపై కక్ష కట్టి వేధింపులకు దిగారు. ఆ దూషణల పర్వం నేను ప‌నిచేసే చోటు వరకు రావడం బాధాకరం. నాకు ఫోన్ చేసి న‌న్ను, నా స‌హ ఉద్యోగుల‌ను, విద్యార్థుల‌ను, కుటుంబాన్ని అసభ్యంగా దూషిస్తున్నారు. ట్రోల్ చేయండి.. కానీ అవి కుటుంబాల‌ను ల‌క్ష్యం చేసుకునేలా ఉండ‌కూడ‌దు. ఇప్పటికైనా నన్ను టార్చర్‌ పెట్టడం ఆపండి' అని వీడియోలో శ్రేష్ట పేర్కొంది.

 చదవండి: IPL 2026: క్వాలిఫయర్‌-1 పోరు.. ఫైనల్‌ వెళ్లేదెవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement