సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా.. ఇద్దరు ఇద్దరే. సమకాలీన క్రికెట్‌లో పరుగులు సాధించడంలో పోటీ పడ్డారు. సచిన్ రెండు ఫార్మాట్లలో(వన్డే, టెస్టులు) ఎదురులేకుండా సాగితే.. లారా మాత్రం టెస్టుల్లో సచిన్‌కు ధీటుగా నిలిచాడు. అంతేకాదు ఎవరికి సాధ్యం కాని క్వాడ్రపుల్ సెంచరీ(400 పరుగులు)ని లారా అందుకున్నాడు. సచిన్ వంద సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకున్నప్పటికి ట్రిపుల్ సెంచరీ, క్వాడ్రపుల్ సెంచరీలు తీరని కలగానే మిగిలిపోయాయి. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకేచోట కలిస్తే చూడడానికి ఆ ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంటుంది.
తాజాగా హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన లీడర్‌షిప్ సమ్మిట్‌కు హాజరైన వీరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు తమ గురించి అభిమానులకు కొన్ని వాస్తవాలను తెలియపరిచారు. మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు..తమ ట్రేడ్ మార్క్, నిరాశలో కూరుకున్నప్పుడు ఎలా ఉన్నారు లాంటి విషయాలను వెల్లడించారు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సచిన్, లారా కలిసి బ్యాటింగ్ చేయడం గురించి కునాల్ అడిగారు. ఆ వీడియో కోసం అభిమానులు యూట్యూబ్‌లో విపరీతంగా సెర్చ్ చేశారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లతో లాంటి స్టార్లు ఉన్న పాకిస్థాన్ లైనప్‌ను ఎలా కూల్చివేశారో సచిన్, లారా వివరంగా తెలియజేశారు.
సిడ్నీలో సచిన్ ఐకానిక్ డబుల్ సెంచరీ చేసినప్పుడు తన ఆనందాన్ని ఎలా నియంత్రించుకున్నాడో లారా గుర్తు చేసుకున్నాడు. ప్రతి అభిమానివ వలే ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు. అలాగే లారా పరుగుల దాహం, నిలకడం, నైపుణ్యం గురించి సచిన్ ప్రశంసించాడు. కరెబియన్ దిగ్గజం కిట్ బ్యాగ్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు.
టి20 రాకతో క్రికెట్ చాలా మారిపోయిందని ఇద్దరు మాజీలు తెలియజేశారు.ఇప్పటి బ్యాటర్లు తమ వినూత్న 360 డిగ్రీల షాట్లతో బ్యాటింగ్‌లో విప్లవాత్మక మార్పులు చేశారని.. కొంతమంది వారిని ఎగతాళీ చేసినప్పటికీ.. వారి వైవిధ్యమైన ఆటతీరు గేమ్‌ను మంచిగా మార్చివేసిందని లారా స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం చాలాకష్టమని.. కొంతమంది టెస్టుల్లో కష్టపడుతుంటే.. కొంతమంది మాత్రం టి20 ఫార్మాట్‌లో సవాలు ఎదుర్కొంటున్నారని తెలిపాడు.
పాకిస్థాన్‌కు మెరుగైన జట్టు ఉందని లారా అభిప్రాయపడ్డాడు. మరోవైపు సచిన్ ఎంసీజీ మైదానం ఇంగ్లాండ్‌కు కలిసొస్తుందని, అందుకని బట్లర్ జట్టు గెలిచే అవకాశముందని స్పష్టం చేశాడు. మొత్తంమీద సచిన్, లారా ఇద్దరూ మరోసారి తమ అభిమానులతో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment