చెన్నై: ఒక్కో బంతి, ఒక్కో పరుగుకు గుండెచప్పుడు పెరుగుతుంటే... మరోసారి ‘చోకర్స్’ అనిపించుకోరాదని దక్షిణాఫ్రికా ఒకవైపు... ఈ అవకాశం పోతే వన్డే వరల్డ్‌కప్‌లో తమ ఖేల్ ఖతమ్ అని తెలుసు కాబట్టి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పాకిస్తాన్ మరోవైపు... వరల్డ్ కప్ 26వ మ్యాచ్ అభిమానులకు అత్యంత ఉత్కంఠను పెంచి ఆసక్తికరంగా ముగిసింది. విజయానికి చేరువైన దశలో 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడం సఫారీ టీమ్‌లో ఆందోళన పెంచగా... ఆఖరి వికెట్ తీసేందుకు 11 బంతులు పోరాడిన పాక్ చివరకు తలవంచింది.
17 బంతుల్లో 4 పరుగులు కావాల్సి ఉండగా ఒత్తిడిని అధిగమించి కేశవ్ మహరాజ్ కొట్టిన బౌండరీతో ఆట ముగిసింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ముందుగా పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (52 బంతుల్లో 52; 7 ఫోర్లు), బాబర్ ఆజమ్ (65 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్), షాదాబ్ ఖాన్ (36 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ప్రదర్శన చేశారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీకి 4 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు చేసి గెలిచింది. మార్క్‌రమ్ (93 బంతుల్లో 91; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీఫైనల్ చేరే అవకాశాలను దాదాపుగా కోల్పోయింది.
కీలక భాగస్వామ్యం...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు అబ్దుల్లా (9), ఇమామ్ (12) సమష్టిగా విఫలమయ్యారు. తొలి బంతికే జాన్సెన్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రిజ్వాన్ (27 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే రిజ్వాన్, ఇఫ్తికార్ (21)లను తక్కువ వ్యవధిలో అవుట్ చేసి దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది.
మరోవైపు తడబడుతూనే ఆడిన బాబర్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని అదే స్కోరు వద్ద వెనుదిరిగాడు. 141/5 స్కోరుతో పాక్ కుప్పకూలడం ఖాయమనిపించింది. ఈ దశలో షాదాబ్, షకీల్ కలిసి జట్టును ఆదుకున్నారు. చక్కటి సమన్వయంతో పాటు వీరిద్దరు ధాటిగా బ్యాటింగ్ చేశారు.
ఆరో వికెట్‌కు షకీల్‌తో కలిసి 84 పరుగులు (71 బంతుల్లో) జోడించిన అనంతరం షాదాబ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 50 బంతుల్లో షకీల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. కానీ అతను అవుటైన తర్వాత పరుగులు జోడించడంలో పాక్ విఫలమైంది. 30 పరుగుల వ్యవధిలో జట్టు చివరి 4 వికెట్లు కోల్పోగా మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగిసింది.
రాణించిన మార్క్‌రమ్...
ఛేదనను దక్షిణాఫ్రికా దూకుడుగా మొదలు పెట్టింది. షాహిన్ వేసిన రెండో ఓవర్లో డికాక్ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు) నాలుగు ఫోర్లు బాదగా, బవుమా (27 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరితో పాటు వివాదాస్పద డీఆర్‌ఎస్ నిర్ణయానికి డసెన్ (21), ఫామ్‌లో ఉన్న క్లాసెన్ (12) కూడా వెనుదిరగడంతో పాక్ జట్టులో ఆశలు రేగాయి.
అయితే మార్క్‌రమ్, మిల్లర్ (29) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. తమ సహజశైలిలో వీరు ధాటిగా ఆడటంతో సఫారీ జట్టు గెలుపు దిశగా దూసుకుపోయింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 70 పరుగులు జత చేశారు. అయితే లక్ష్యానికి చేరువవుతున్న దశలో పాక్ బౌలర్లు చెలరేగడంతో టీమ్ తక్కువ వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయింది.
59 బంతుల్లో కేవలం 21 పరుగులు చేయాల్సిన దశలో మార్క్‌రమ్ అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠభరిత ముగింపు వైపు సాగింది. ఫీల్డింగ్‌లో తలకు గాయం కావడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో పాక్ బౌలర్ షాదాబ్ మైదానం వీడగా... ‘కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్’గా ఉసామా మీర్ బరిలోకి దిగాడు. వరల్డ్ కప్‌లో ఇదే తొలి ‘కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్’ ఘటన కావడం విశేషం.
స్కోరు వివరాలు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: అబ్దుల్లా (సి) ఎన్‌గిడి (బి) జాన్సెన్ 9; ఇమామ్ (సి) క్లాసెన్ (బి) జాన్సెన్ 12; బాబర్ (సి) డికాక్ (బి) షమ్సీ 50; రిజ్వాన్ (సి) డికాక్ (బి) కొయెట్జి 31; ఇఫ్తికార్ (సి) క్లాసెన్ (బి) షమ్సీ 21; షకీల్ (సి) డికాక్ (బి) షమ్సీ 52; షాదాబ్ (సి) మహరాజ్ (బి) కోయెట్జి 43; నవాజ్ (సి) మిల్లర్ (బి) జాన్సెన్ 24; షాహిన్ (సి) మహరాజ్ (బి) షమ్సీ 2; వసీమ్ (సి) డికాక్ (బి) ఎన్‌గిడి 7; రవూఫ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–20, 2–38, 3–86, 4–129, 5–141, 6–225, 7–240, 8–259, 9–268, 10–270. బౌలింగ్: జాన్సెన్ 9–1–43–3, ఎన్‌గిడి 7.4–0–45–1, మార్క్ రమ్ 4–0–20–0, మహరాజ్ 9–0–56–0, కోయెట్జి 7–0–42–2, షమ్సీ 10–0–60–4.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (సి) షకీల్ (బి) వసీమ్ 28; డికాక్ (సి) వసీమ్ (బి) షాహిన్ 24; డసెన్ (ఎల్బీ) (బి) ఉసామా 21; మార్క్‌రమ్ (సి) బాబర్ (బి) ఉసామా 91; క్లాసెన్ (సి) ఉసామా (బి) వసీమ్ 12; మిల్లర్ (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 29; జాన్సెన్ (సి) బాబర్ (బి) రవూఫ్ 20; కోయెట్జి (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 10; మహరాజ్ (నాటౌట్) 7; ఎన్‌గిడి (సి) అండ్ (బి) రవూఫ్ 4; షమ్సీ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (47.2 ఓవర్లలో 9 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–34, 2–67, 3–121, 4–136, 5–206, 6–235, 7–250, 8–250, 9–260. బౌలింగ్: ఇఫ్తికార్ 3–0–23–0, షాహిన్ అఫ్రిది 10–0–45–3, నవాజ్ 6.2–0–40–0, రవూఫ్ 10–0–62–2, వసీమ్ 10–1–50–2, ఉసామా 8–0–45–2.
ప్రపంచకప్‌లో నేడు
ఆ్రస్టేలియా X న్యూజిలాండ్
వేదిక: ధర్మశాల
ఉదయం గం. 10:30 నుంచి
బంగ్లాదేశ్ X నెదర్లాండ్స్
వేదిక: కోల్‌కతా
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment