పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి ఈ టోర్నీతో రీఎంట్రీ ఇచ్చారు. 2023 వన్డే వరల్డ్‌కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఈ టోర్నీ కోసం ఎంపికయ్యారు.
ఈ జట్టులో టోనీ డి జోర్జీ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, వియాన్ ముల్దర్ లాంటి కొత్త ముఖాలు ఉన్నాయి. ఈ ముగ్గురికి ఇదే తొలి 50 ఓవర్ల ఐసీసీ టోర్నీ.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు..
టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్
ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 21న ఆడనుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ప్రొటీస్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 25న రావల్పిండిలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. తదనంతరం మార్చి 1న కరాచీలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌తో పోటీపడనుంది.
కాగా, సౌతాఫ్రికా ఇటీవలికాలంలో ఐసీసీ ఈవెంట్లలో అదరగొడుతున్న విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ప్రొటీస్ టీమ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. సౌతాఫ్రికా గత రెండు ఐసీసీ ఈవెంట్లలో చేసిన ప్రదర్శనలే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రిపీట్ చేయాలని భావిస్తుంది. సౌతాఫ్రికాకు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన అనుభవం కూడా ఉంది. ఈ జట్టు 1998 ఇనాగురల్ ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో సౌతాఫ్రికా వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది.
ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి పాక్‌ను మట్టికరిపించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ అనంతరం సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు అర్హత సాధించింది. బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment