
Mondli Khumalo Health Condition: బ్రిడ్జ్‌వాటర్‌లో గత ఆదివారం(మే 29న) దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ ఖుమాలో కోమా నుంచి బయట పడ్డాడు. ఈ విషయాన్ని అతడి సహచర ఆటగాడు లాయిడ్ ఐరిష్ తెలిపాడు. మొండ్లీ ఖుమా యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్ పెర్తర్‌టన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా గత ఆదివారం తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. అతడి మెదడులో రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు మూడు సర్జరీలు చేశారు.
"మొండ్లీ శుక్రవారం కోమా నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడు తన తల్లి కోసం అడుగుతున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌ను చూస్తున్నాడు. ఇక అతడి తదుపరి మ్యాచ్ ఎప్పుడు అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు. గత 24 గంటల్లో అతడు బాగా కోలుకున్నాడు అని లాయిడ్ ఐరిష్ పేర్కొన్నాడు.
ఇక 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు.
చదవండి: నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు