అఫ్గానిస్తాన్(Afghanistan)లో ప్రస్తుతం తాలిబాన్ల పరిపాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా సంకీర్ణ సేనల నిష్క్రమణతో మళ్లీ అధికారం చేపట్టిన తాలిబాన్లు అఫ్గాన్‌లో స్త్రీ హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరించి కట్టుబాట్లతో ముళ్లబాట పరుస్తున్నారు. అఫ్గానిస్తాన్‌కు చెందిన మహిళా జట్లను ఏ క్రీడల్లోనూ పాల్గొనివ్వడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)లో అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టుతో మ్యాచ్ ఆడొద్దంటూ పలు దేశాల క్రికెట్ బోర్డులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు 160 మందికి పైగా రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేయగా.. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా చేరింది.
త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్‌తో మ్యాచ్ రద్దు చేసుకోవాలని సౌతాఫ్రికా క్రికెట్(South Afrcia)ను ఆ దేశ ప్రజలు నినాదిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా ప్రజల డిమాండ్‌కు ఆ దేశ క్రీడల మంత్రి గేటన్ మెకెంజీ సంఘీభావం తెలిపారు.
"ప్రజల నిరసనకు నైతిక మద్దతు తెలుపుతున్నాను. అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి. అయితే నా అధికారాలు పరిమితం. ఇందులో నేను నిర్ణయం తీసుకోలేను. దక్షిణాఫ్రికా ప్రభుత్వం, క్రికెట్ బోర్డు సమాలోచనలు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.
ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకోవాలి. బోర్డు విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసినట్లు, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుపై కూడా వేటు వేయాలి. క్రీడల వ్యవహరాల్లో రాజకీయ జోక్యాన్ని ఏ మాత్రం సహించకూడదు. మహిళల పట్ల వివక్ష చూపుతున్న అఫ్గానిస్తాన్ వైఖరిని క్రికెట్ దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు సైతం ఖండించాలి" అని గేటన్ మెకెంజీ పేర్కొన్నారు.
మరో 40 రోజుల్లో..
కాగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో 40 రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో సఫారీ జట్టు కరాచీ వేదికపై ఫిబ్రవరి 21న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.
ఇక టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
ఈ టోర్నీలో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ శనివారం(జనవరి11) ప్రకటించే అవకాశముంది.
చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్‌గా మైఖేల్ వాన్ తనయుడు
Comments
Please login to add a commentAdd a comment