ఆమె దృఢ సంకల్పానికి అంగ వైకల్యం అడ్డు కాలేదు. మొండి పట్టుదలతో అనుకున్నది సాధించింది. 22 ఏళ్లకే రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా.. కృత్రిమ కాలితో తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడలో సక్సెస్ సాధించింది. విధి వెక్కిరించినా సంచలనాలు సృష్టించింది. ఆమె ఆత్మ విశ్వాసం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది. ఈ నిజమైన విజేత పేరే మానసి జోషి.
గుజరాత్‌లో పుట్టి, ముంబైలో పెరిగిన 34 ఏళ్ల మానసి రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా ఏమాత్రం అధైర్యపడకుండా జీవితంలో ముందడుగు వేసింది. కృత్రిమ కాలితో తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడలో సక్సెస్ సాధించింది. శారీరక లోపాన్ని జయించి అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఈ క్రమంలో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌గా, వరల్డ్ నంబర్ వన్ షట్లర్‌గా ఎదిగింది.
ఆరేళ్ల వయసులోనే రాకెట్ పట్టుకున్న మానసి ఓవైపు ఉన్నత చదువులు చదువుతూనే.. క్రీడల్లో రాణించింది. ముంబైలో ఇంజినీరింగ్ పూర్తి చేశాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన మానసి.. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. 2011 డిసెంబర్ 2న ద్విచక్రవాహనంపై ఆఫీసుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఆమె ఎడమ కాలు పూర్తిగా ఛిద్రమైంది.
కాలు కోల్పోయాక కొద్ది రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన మానసి.. వైకల్యం తన ఎదుగుదలకు అడ్డుకాకూడని నిశ్చయించుకుని ముందడుగు వేసింది. కృత్రిమ కాలును అమర్చుకొని తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ బరిలోకి రీఎంట్రీ ఇచ్చింది. కఠోర శ్రమ అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మానసి.. 2018లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది.
గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన మానసి.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌తో పాటు మరెన్నో అంతర్జాతీయ పతకాలు సాధించింది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందింది. 2022లో మానసి వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్‌గా అవతరించింది. అమెరికాకు చెందిన బార్బీ కంపెనీ మానసి సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆమె పోలికలతో బార్బీ బొమ్మను రూపొందించింది. తాజాగా చైనాలో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన మానసి.. సహచర క్రీడాకారిణిలతో కలిసి ఫోటోకు పోజిచ్చింది.
With Para baddy girls in China 🇨🇳 pic.twitter.com/bkDNlDM5vl
— Manasi Joshi (@joshimanasi11) February 29, 2024
Comments
Please login to add a commentAdd a comment