Photo Credit: Twitter
ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు బలహీనంగా ఉందని, ఇంగ్లండ్ గడ్డపై ఆ జట్టుకు టెస్టు సిరీస్‌లో మరోసారి వైట్‌వాష్‌కు తప్పదనిపిస్తుందని బ్రాడ్ అంచనా వేశాడు. ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బ్రాడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. హెడ్డింగే వేదికగా ఇవాళ్టి నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.
‘కెరీర్ చివరి దశలో ఉన్న 36 ఏళ్ల మహ్మద్ అబ్బాస్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. దీన్నిబట్టే పాక్ జట్టు ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతుంది. గత పర్యటనల్లో ఎదురైన అనుభవమే ఈసారి కూడా పాకిస్తాన్‌కు ఎదురయ్యే అవకాశముంది. ఈసారి మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో పాక్‌ను వైట్‌వాష్ చేస్తుందని భావిస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు.

ఆరింటిలో నాలుగు ఓటమి
అయితే బంగ్లాదేశ్ పర్యటనకు ముందే మహ్మద్ అబ్బాస్‌ను టెస్టు జట్టులోకి తిరిగి తీసుకొచ్చారు. అయితే పాక్ జట్టు ఓటములు చవిచూసినప్పటికీ, మహ్మద్ అబ్బాస్ మాత్రం అసాధారణ ప్రదర్శన చేశాడు. తాను ఆడిన మూడు టెస్టుల్లో 18 వికెట్లు తీశాడు. కానీ బ్రాడ్ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్‌లో పాకిస్తాన్ ఆశించినంత మేర రాణించలేకపోతుంది. బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్‌కు గురవ్వడంతో పాటు ఆరు టెస్టుల్లో నాలుగింట పరాజయం చవిచూసింది.
హెడ్డింగే వేదికగా ఇవాళ్టి నుంచే తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ తమ సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజం లేకుండానే బరిలోకి దిగుతోంది. విండీస్ పర్యటనలో తన ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్న బాబర్ ఆజం.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బెకెన్‌హమ్‌లో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కుడి చేతికి గాయమైంది.
తొలి టెస్టుకు బాబర్ దూరం
గాయం తీవ్రత ఎక్కువగా లేనప్పటికీ, పూర్తి ఫిట్‌నెస్ లేకపోవడంతో ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ దూరమయ్యాడు. దీంతో బాబర్ ఆజం గైర్హాజరీ పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను బలహీనం చేసినట్లయింది. బంగ్లాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టులో చాలా మార్పులు చేసింది.
షాన్ మసూద్ స్థానంలో బాబర్ ఆజమ్‌కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే గాయంతో బాబర్ ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దూరం కావడంతో సల్మాన్ అగా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో విండీస్‌తో టెస్టు సిరీస్‌కు షహీన్ అఫ్రిది, హసన్ అలీ, నసీమ్ షాలకు బదులు మహ్మద్ అబ్బాస్, ఖుర్రమ్ షెహజాద్‌లను ఆడించి మంచి ఫలితాన్ని అందుకుంది.
తొలి టెస్టులో ఓడినప్పటికీ, రెండో టెస్టులో బాబర్ ఆజం సేన అద్భుత విజయాన్ని అందుకొని సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఇక బెకెన్‌హమ్ వేదికగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సౌద్ షకీల్, అబ్దులా షఫీక్, ఉస్మాన్ అలీ, మహమ్మద్ అలీ రాణించడం పాకిస్తాన్‌కు సానుకూలాంశమని చెప్పొచ్చు. ఇక 2024లో చివరిసారి పాక్ గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది.


