సూపర్ ఇన్నింగ్స్‌.. తిలక్‌కు సలాం కొట్టిన సూర్యకుమార్‌ | Suryakumar Yadav Bows Down To Tilak Varma After India's Nail-Biting Victory In Chennai | Sakshi
Sakshi News home page

సూపర్ ఇన్నింగ్స్‌.. తిలక్‌కు సలాం కొట్టిన సూర్యకుమార్‌! వీడియో వైరల్‌

Published Sun, Jan 26 2025 10:51 AM | Last Updated on Sun, Jan 26 2025 11:00 AM

Suryakumar Yadav Bows Down To Tilak Varma After India's Nail-Biting Victory In Chennai

అంత‌ర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ(Tilak Varma) త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో తిల‌క్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. త‌న అద్బుత‌ప్ర‌ద‌ర్శ‌న‌తో భారత్‌కు వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని అందించాడు. 

సంజూ శాంస‌న్, అభిషేక్‌, సూర్య వంటి ప్ర‌ధాన ఆట‌గాళ్లు తేలిపోయిన చోట తిల‌క్ విరోచిత పోరాటం క‌న‌బ‌రిచాడు. ల‌క్ష్య చేధ‌న‌లో క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి తిల‌క్ మాత్రం టెయిలాండ‌ర్ల‌తో క‌లిసి త‌న సూప‌ర్ ఇన్నింగ్స్‌ను కొన‌సాగించాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన తిల‌క్ వ‌ర్మ‌..  ఆఖ‌రివ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డి మ్యాచ్‌ను ముగించాడు.

ఓవ‌రాల్‌గా వ‌ర్మ‌ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 72 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అత‌డి విరోచిత పోరాటం ఫ‌లితంగా 166 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 8 వికెట్లు కోల్పోయి 19.2 ఓవ‌ర్ల‌లో అందుకుంది. త‌ద్వారా చెపాక్ టీ20లో 2 వికెట్ల తేడాతో టీమిండియా విజ‌యాన్ని అందుకుంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో భార‌త జ‌ట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

సూర్య పిధా.. 
కాగా హైద‌రాబాదీ తిల‌క్ వ‌ర్మ అసాధారణ బ్యాటింగ్‌‌కు కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్(Suryakumar Yadav) పిధా అయ్యాడు. విజ‌యనంత‌రం గ్రౌండ్‌లోకి వ‌చ్చిన సూర్య‌.. తిల‌క్ వ‌ద్ద‌కు వెళ్లి త‌ల వంచి మ‌రి చ‌ప్ప‌ట్లు కొడుతూ అభినందించాడు.  అందుకు తిల‌క్ కూడా సంతోషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా తిల‌క్, సూర్యకు మంచి అనుబంధం ఉంది.

వ‌ర్మ భార‌త జ‌ట్టులోకి రాక‌ముందే ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున సూర్య‌తో క‌లిసి ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.  ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్‌ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.

భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం (జనవరి 28) రాజ్‌కోట్‌లో జరగనుంది.
చదవండి: IND vs ENG: తిలక్‌ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement