టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా ఈనెల 10న టీమిండియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే ఆ జట్టు డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ జట్టుకు దూరం కాగా.. తాజాగా స్టార్ పేసర్ మార్క్ వుడ్ జనరల్ స్టిఫ్‌నెస్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. గాయం కారణంగా వుడ్ ప్రాక్టీస్‌కు సైతం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వుడ్ సమస్య అంత పెద్దదేమీ కాకపోయినప్పటికీ.. ఇండియాతో మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడా లేదా అన్నది ఇంగ్లీష్ టీమ్‌ను కలవరపెడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో వుడ్.. టీమిండియాతో మ్యాచ్ సమయానికి ఫిట్‌గా లేకపోతే, ఆ ప్రభావం కచ్చితంగా జట్టు విజయావకాశాలపై పడుతుందని ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ కంగారు పడుతుంది. ఒకవేళ వుడ్ మ్యాచ్ సమయానికి కోలుకోలేకపోతే.. అతనికి ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తైమాల్ మిల్స్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాలని మేనేజ్‌మెంట్ భావిస్తుంది. కాగా, వరల్డ్‌కప్-2022లో వుడ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి మాంచి ఊపుమీదున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, గ్రూప్-1 నుంచి అతికష్టం మీద సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్‌కు నిన్న (నవంబర్ 7) కూడా ఓ భారీ షాక్ తగిలింది. కీలక ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మలాన్ గజ్జల్లో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. నవంబర్ 1న శ్రీలంకతో జరిగిన సెమీస్ డిసైడర్ మ్యాచ్‌లో గాయపడిన మలాన్.. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారులు మలాన్ స్థానాన్ని ఫిలిప్ సాల్ట్‌తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment