ధర్మశాల వేదికగా టీమిండియాతో రేపటి నుంచి (మార్చి 7) ప్రారంభం కాబోయే ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు ఇవాళ ప్రకటించారు. ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఒకే ఒక మార్పు చేసింది. నాలుగో టెస్ట్‌లో ఆడిన ఓలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇంగ్లండ్ అదనపు పేసర్‌ను బరిలోకి దించుతుందని అంతా ఊహించారు.
అయితే ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ పేసర్ స్థానంలో మరో పేసర్‌కే అవకాశం ఇచ్చింది. మొత్తంగా ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ టీమ్ ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. మార్క్ వుడ్‌తో పాటు వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తుది జట్టుకు ఎంపికయ్యారు. రాబిన్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వుడ్.. ప్రస్తుత సిరీస్‌లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
హైదరాబాద్, రాజ్‌కోట్ మ్యాచ్‌ల్లో ఆడిన వుడ్ ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చకపోవడంతో నాలుగో టెస్ట్‌కు ఎంపిక కాలేదు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వుడ్ 55.5 సగటున కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. రాబిన్సన్ విషమానికొస్తే.. ఈ సిరీస్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడిన అతను పేలవ ప్రదర్శన కనబర్చి తుది జట్టులో (ఐదో టెస్ట్) స్థానం కోల్పోయాడు. ఈ సిరీస్‌లో నాలుగో టెస్ట్ ఆడిన రాబిన్సన్ కేవలం 13 ఓవర్లు మాత్రమే వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
ఆ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రాబిన్సన్‌కు బౌలింగ్ కూడా ఇవ్వలేదు. నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
ధర్మశాల టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్
Comments
Please login to add a commentAdd a comment