టి20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశ ఇవాళ్టితో(నవంబర్ 6) ముగిసింది. సూపర్-12లో ఆఖరి మ్యాచ్ ఆడిన టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇంతవరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క. సెమీఫైనల్స్ అంటే నాకౌట్ మ్యాచ్‌ల కింద లెక్క. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇప్పటికే గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లు.. గ్రూప్-2 నుంచి టీమిండియా, పాకిస్తాన్‌లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో గ్రూప్-1 టాపర్ అయిన కివీస్.. గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్‌తో తలపడనుండగా.. గ్రూప్-2 టాపర్ అయిన టీమిండియా గురువారం గ్రూప్-1లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ను ఎదుర్కొంటుంది.
కాగా ఈసారి టీమిండియా ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమి కాదని.. కానీ అందులోనే ఒక చిక్కుముడి ఉందని అభిమానులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐసీసీ టి20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇంగ్లండ్, టీమిండియాలు పెద్దగా తలపడింది లేదు. కేవలం మూడుసార్లు మాత్రమే ఈ జట్లు ఎదురుపడగా.. భారత్ రెండుసార్లు, ఇంగ్లండ్ ఒకసారి విజయం సాధించాయి. అయితే ఈసారి మాత్రం ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయలేం.
ఎందుకంటే ఆ జట్టులో ఇప్పుడు ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ ఆటగాడి వరకు బ్యాటింగ్ ఆడగల సత్తా ఉంది. బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఇంగ్లండ్‌ను ఓడించాలంటే టీమిండియా సర్వశక్తులు ఒడ్డాల్సిందే. అయితే టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, టీమిండియా మ్యాచ్ అనగానే యువరాజ్ సింగ్ గుర్తుకురాక మానడు.
2007 తొలి ఎడిషన్ టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు అప్పట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు టి20 క్రికెట్ చరిత్రలో 12 బంతుల్లోనే అర్థశతకం సాధించిన తొలి క్రికెటర్‌గా యువరాజ్ చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పటికి ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది.
2007 టి20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలిస్తే.. 2009లో ఇంగ్లండ్ భారత్‌ను చిత్తు చేసింది. ఇక 2012లో ఇంగ్లండ్, టీమిండియాలు చివరిసారిగా తలపడగా ఈసారి టీమిండియాను విజయం వరించింది. దాదాపు పదేళ్ల తర్వాత నవంబర్ 10న ఇంగ్లాండ్, ఇండియా మధ్య ఆడిలైడ్ వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ప్రస్తుతం టీమిండియాలో ఇప్పుడు సూర్యకుమార్ ఒక సంచలనం. దూకుడే మంత్రంగా కొనసాగుతున్న సూర్యకుమార్ సెమీస్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో దంచికొట్టి టీమిండియాను గెలిపిస్తాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 2007లో ఇంగ్లండ్‌పై యువరాజ్ ఎలా అయితే మెరిశాడో.. ఇప్పుడు సూర్య కూడా అలాగే మెరిస్తే ఇంగ్లండ్‌పై విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదని అభిప్రాయపడ్డారు.
మరోవైపు న్యూజిలాండ్‌పై మాత్రం పాకిస్తాన్‌కి తిరుగులేని రికార్డు ఉంది. 2003 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌ని టీమిండియా ఐసీసీ టోర్నీల్లో ఓడించలేకపోయింది. అయితే కివీస్ మాత్రం టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. 2007 టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన న్యూజిలాండ్, 2009, 2012 టి20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ గ్రూప్ స్టేజీలో పరాజయం పాలైంది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ టీమిండియాను చిత్తు చేయగా... పాకిస్తాన్ మాత్రం సునాయాసంగా కివీస్‌ని ఓడించి టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment