''టి20 ప్రపంచకప్‌లో టీమిండియా- పాకిస్తాన్ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్ జరగనివ్వం.. అది జరగాలంటే ముందు టీమిండియా మమ్మల్ని ఓడించాలి..'' భారత్‌తో సెమీస్‌కు ముందు ఒక్కరోజు ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఏ ముహుర్తానా ఆ మాట అన్నాడో తెలియదు కానీ..ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకోవడమంటే ఏదో మాములుగా కాదు.. టీమిండియాకు తమ జీవితకాలంలో మరిచిపోలేని పరాజయాన్ని అందించి పంతం నెగ్గించుకున్నాడు.
మరో ఆసక్తికర విషయమేంటంటే.. టీమిండియా ఓటమిని శాసించింది కూడా జాస్ బట్లరే. అలెక్స్ హేల్స్‌తో కలిసి టీమిండియా బౌలర్లను చెడుగుడు ఆడుకున్న బట్లర్.. 169 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే కరిగించాడు. కెప్టెన్‌గా తన మాట నిలబెట్టుకున్నాడు. మరో విషయమేంటంటే బట్లర్ సూపర్-12 దశలో ఒక్క మ్యాచ్‌లో సరైన ప్రదర్శన కనబరచింది లేదు. కీలకమైన సెమీస్‌లో తన మార్క్ ఆటను ప్రదర్శిస్తూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాటు ఫామ్‌లోకి వచ్చేశాడు. ఒక్కసారి బట్లర్ ఫామ్‌లోకి వచ్చాడంటే ఇంగ్లండ్ కథ పూర్తిగా మారిపోయినట్లే. ఇలాగే ఆడితే ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించడం ఇంగ్లండ్‌కు పెద్ద పని కాదు.
వాస్తవానికి ఇంగ్లండ్ విజయం సాధించడమే కరెక్టని చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ను వర్షం కారణంగా ఓడిపోయింది తప్ప ఇంగ్లండ్ అన్ని మ్యాచ్‌ల్లోనూ మంచి విజయాలు అందుకుంది. ముఖ్యంగా జట్టులో ఒకటి నుంచి పదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు.. ఆల్‌రౌండర్లు ఆ జట్టుకు పెద్ద బలం.. ఇక బౌలింగ్‌లోనూ స్ట్రాంగ్‌గా ఉండడం ఆ జట్టకు కలిసివచ్చింది. గ్రూప్-1 నుంచి రెండో స్థానంతో సెమీస్ చేరినప్పటికి అసలైన మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లండ్ జూలు విదిల్చింది. టీమిండియాకు అసలు అవకాశమే ఇవ్వకుండా వన్‌సైడ్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.
పేరుకే గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా సూపర్-12 దశలో సమిష్టిగా రాణించిన సందర్భాలు చాలా తక్కువ. ఎవరో ఒక బ్యాటర్‌పైనే పూర్తిగా ఆధారపడడం.. లేదంటే అదృష్టం కలిసివచ్చి బౌలర్లు ఆరోజు మ్యాచ్‌లో చెలరేగడం వల్ల టీమిండియా విజయాలు సాధించి తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. ఆడితే కోహ్లి లేదంటే సూర్యకుమార్.. ఇంతే టీమిండియా బ్యాటింగ్. రాహుల్ ఫాంలోకి వచ్చాడన్న మాట రెండు మ్యాచ్‌లకే పరిమితమైంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అయితే రాహుల్ అదే పేలవమైన షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సెమీస్‌లోనైనా తన ఫామ్ చూపిస్తాడనుకుంటే మళ్లీ అదే రొడ్డకొట్టుడు ఆటతీరు. ఆరంభంలో ఫోర్లు, సిక్సర్లు బాది చివరికి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం అతనికి అలవాటుగా మారిపోయంది. ఈ ప్రపంచకప్‌లో కోహ్లి, సూర్యల గురించి తప్ప టీమిండియాలో మాట్లాడుకోవడానికి ఏం లేదు.
ఇక బౌలర్ల పరిస్థితి అగమ్యగోచరం. బుమ్రా స్థానంలో వచ్చిన షమీ సూపర్-12 వరకు కాస్త బెటర్ అనిపించినప్పటికి కీలక సెమీస్‌లో చేతులెత్తేశాడు. ఇక భువనేశ్వర్ తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడేసినట్లే. అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే గుడ్డిలో మెల్ల అన్నట్లు 2 ఓవర్లలో 15 పరుగులిచ్చాడు. ఓవరాల్‌గా కూడా అర్ష్‌దీప్ ప్రదర్శన బాగానే ఉంది. ఇక అశ్విన్, అక్షర్ పటేల్‌లు పూర్తిగా విఫలమయ్యారు. చహల్‌ను ఎందుకు పక్కనబెట్టారంటే దానికి సమాధానం ఉండదు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ వరకు రావడం ఒక్కటే కాస్త ఉపశమనం అని చెప్పొచ్చు. అంతకుమించి ఏం లేదు టీమిండియా గురించి మాట్లాడుకోవడానికి..
Comments
Please login to add a commentAdd a comment