Troll On Virat Kohli Daughter: భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధించే వీరాభిమానులు కోకొల్లలు. ఆరాధ్య ఆటగాళ్లు గెలిస్తే.. దానిని తమ విజయంగా భావించడం సహా.. ఓడినపుడు వారికి మద్దతుగా నిలిచి అభిమానం చాటుకుంటారు. కానీ కొంతమంది ‘‘అభిమానం’’ పేరిట వెర్రి వేషాలు వేస్తూ.. హద్దులు దాటి కామెంట్లు చేస్తూ నీచపు బుద్ధిని బయటపెట్టుకుంటారు. జట్టు ఓడితే దానిని ఓ ఒక్కరికో పరిమితం చేసి విషం చిమ్ముతారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ విపరీత ధోరణి మరింత ఎక్కువైంది.
టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి భార్యాబిడ్డలను ఉద్దేశించి చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనం. ఈ మెగా ఈవెంట్‌లో తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో కనీవిని ఎరుగని రీతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా... అక్టోబరు 31 నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలై... సెమీస్ చేరే అవకాశాలను దూరం చేసుకుంది.
ఈ నేపథ్యంలో కివీస్‌తో ఓటమి అనంతరం కొంతమంది నెటిజన్లు విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతుల చిన్నారి కూతురు వామికాను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సిగ్గు పడు అనుష్క... వామికా ఫొటోలు ఎప్పుడెప్పుడు బయటపెడతారా అని చూస్తున్నాం. అలా అయితేనే కదా తనను గుర్తించి ...... దాడి చేయగలం అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ ట్వీట్ ఓ అమ్మాయి పేరిట.. అది కూడా దాయాది దేశపు క్రికెట్ జెర్సీలో ఉన్న ఫొటో ఉండటం గమనార్హం. దీంతో ఆ అకౌంట్ పాకిస్తాన్‌కు చెందిన యూజర్ అని కొంతమంది కామెంట్ చేస్తుండగా.. బూమ్ వెబ్‌సైట్ మాత్రం ఇది అబద్ధమని తేల్చింది. ఫాక్ట్‌చెక్‌లో భాగంగా.... సదరు యూజర్ భారత్‌కు చెందిన వారేనని పేర్కొంది. ఈ విషయం గురించి ట్విటర్ ప్రతినిధులను సంప్రదించినట్లు పేర్కొంది.
కాగా పాకిస్తాన్‌తో ఓటమి నేపథ్యంలో కొంతమంది మహ్మద్ షమీని ఉద్దేశించి ట్రోల్ చేయగా... సచిన్, సెహ్వాగ్ సహా కోహ్లి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే కోహ్లి కూతురుపై ఈ రకంగా విషం చిమ్మారని తెలుస్తోంది. ఏదేమైనా ఆటను ఆటలా చూడకుండా.. గెలుపోటములు సహజం అని తెలుసుకోకుండా.. వ్యక్తిగతంగా ఆటగాళ్లపై మాటల దాడి చేయడం సరికాదని నిజమైన అభిమానులు అంటున్నారు. కాగా విరుష్క దంపతులకు ఈ ఏడాది జనవరిలో కూతురు వామిక జన్మించగా.. ఆమె ఫొటోలను ఇంతవరకు రివీల్ చేయలేదు.
చదవండి: ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా!
Comments
Please login to add a commentAdd a comment