![T20 World Cup 2021: Hardik Pandya Bowls In Nets Ahead Ind Vs NZ Match - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/28/Hardik-Pandya.jpg.webp?itok=0Mu4at18)
Photo Courtesy: Social Media
IND vs NZ T20 World Cup 2021:Hardik Pandya Bowls In Nets: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు తుదిజట్టులో చోటు దక్కించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కేవలం బ్యాటర్‌గా హార్దిక్‌ను జట్టులోకి తీసుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదన్న విమర్శల నేపథ్యంలో.. బాల్‌తో నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్‌తో కలిసి నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో భాగంగా బుధవారం(అక్టోబరు 27న) స్కాట్లాండ్‌తో.. నమీబియా మ్యాచ్ ఆరంభానికి ముందు ఇందుకు సంబంధించిన దృశ్యాలు టీవీలో కనిపించాయి.
కాగా టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ నేపథ్యంలో పాకిస్తాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 11 పరుగుల వద్ద ఉండగా అతడి కుడి భుజానికి గాయమైంది. దీంతో స్కానింగ్‌కు పంపగా... టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పాండ్యా స్ధానాన్ని ఇషాన్ కిషన్ భర్తీ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కనీవిని ఎరుగని రీతిలో తొలిసారిగా ప్రపంచకప్ ఈవెంట్‌లో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను బ్యాటర్‌గా తీసుకున్న కోహ్లి నిర్ణయాన్ని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్‌హాగ్ సహా పలువురు తప్పుబట్టారు. పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా చేసిన పెద్ద తప్పు ఇదేనంటూ విమర్శించారు. అంతేగాక తదుపరి మ్యాచ్‌లో అతడిని పక్కన పెట్టాలంటూ పలువురు సూచించారు.
ఈ నేపథ్యంలో అక్టోబరు 31 నాటి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా ఇలా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ ప్రాక్టీసు చేయడం గమనార్హం. ఫిజియో నితిన్ పటేల్, కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ సమక్షంలో ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు బుధవారం తీవ్రంగా కష్టపడ్డాడు. ఈ దృశ్యాలు చూసిన హార్దిక్ పాండ్యా అభిమానులు.. ఎలాగైనా జట్టులో చోటు దక్కించుకుని.. నువ్వేంటో నిరూపించుకోవాలి భాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు మాత్రం... ‘‘చాలు బాబు... మళ్లీ నీ వల్ల మూల్యం చెల్లించుకునే పరిస్థితి రాకూడదు. దయచేసి శార్దూల్‌కు అవకాశం ఇవ్వండి’’ అంటూ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా జూలైలో శ్రీలంక పర్యటనలో పాండ్యా ఆఖరి సారిగా బౌలింగ్ చేశాడు. ఐపీఎల్-2021లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన అతడు ఒక్క మ్యాచ్‌లో కూడా బౌలింగ్ చేయలేదన్న సంగతి తెలిసిందే.
చదవండి: T20 World Cup 2021: టోర్నీ నుంచి అతడు అవుట్... జట్టులోకి జేసన్ హోల్డర్
Comments
Please login to add a commentAdd a comment