T20 World Cup 2021: Kieron Pollard Picks His Top 5 T20 Players - Sakshi
Sakshi News home page

T20 World Cup: పొలార్డ్‌ టాప్‌-5 ఫేవరెట్‌ లిస్టు.. ఆశ్చర్యకరంగా తను కూడా!

Published Wed, Oct 6 2021 5:14 PM | Last Updated on Wed, Oct 6 2021 9:17 PM

T20 World Cup 2021: Kieron Pollard Picks His Top 5 T20 Players - Sakshi

Kieron Pollard Top Five T20 Players: టీ20 వరల్డ్‌కప్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ పొట్టి ఫార్మాట్‌లో తనకు ఇష్టమైన ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించాడు. ఇందులో ఓ విధ్వంసకర ఓపెనర్‌, మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, ఆల్‌రౌండర్‌, మాజీ స్పిన్నర్‌, మాజీ పేసర్‌కు చోటిచ్చాడు. మరి.. కీరన్‌ పొలార్డ్‌ ఫేవరెట్‌ టాప్‌-5 టీ20 క్రికెటర్స్‌ ఎవరంటే..!

క్రిస్‌ గేల్‌(వెస్టిండీస్‌), లసిత్‌ మలింగ(శ్రీలంక), సునిల్‌ నరైన్‌(వెస్టిండీస్‌), ఎంఎస్‌ ధోని(ఇండియా), కీరన్‌ పొలార్డ్‌(వెస్టిండీస్‌). అవును.. తనకు ఇష్టమైన జాబితాలో ముగ్గురూ విండీస్‌ ఆటగాళ్లు.. ముఖ్యంగా అందులో తన పేరును కూడా పొలార్డ్‌ పేర్కొనడం విశేషం.

క్రిస్‌గేల్‌(Chris Gayle)
విధ్వంసకర ఇన్నింగ్స్‌తో యూనివర్స్‌ బాస్‌గా పేరొందిన క్రిస్‌ గేల్‌.. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 446 మ్యాచ్‌లు ఆడి... 14261 పరుగులు చేశాడు. సగటు 36.94. స్ట్రైక్‌రేటు.. 145.87. ఇందులో 22 శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 175(నాటౌట్‌). రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్‌(2012, 2016) గెలిచిన విండీస్‌ జట్టులో ఈ సిక్సర్ల వీరుడు సభ్యుడిగా ఉన్నాడు.

లసిత్‌ మలింగ(Lasith Malinga)
యార్కర్ల కింగ్‌గా పేరొందిన లసిత్‌ మలింగ... తనదైన శైలిలో బంతులు సంధించి ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీ20 ఫార్మాట్‌లో 295 మ్యాచ్‌లలో 390 వికెట్లు తీసిన మలింగ.. 2014లో టైటిల్‌ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు. ఇక ఆటకు స్వస్తి పలికిన మలింగ.. తాను అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్లు సెప్టెంబరు 15న ప్రకటించాడు.

సునిల్‌ నరైన్‌(Sunil Narine)
స్పిన్‌ మాయాజాలంతో ఎంతో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించిన విండీస్‌ ఆటగాడు సునిల్‌ నరైన్‌... పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇమ్రాన్‌ తాహిర్‌, డ్వేన్‌ బ్రావో తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇటీవలి కాలంలో బ్యాటర్‌(లీగ్‌)గా కూడా సత్తా చాటుతున్నాడు. 

ఇక విండీస్‌ 2012లో టీ20 వరల్డ్‌కప్‌ గెలవడంలో నరైన్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌లలో 5.63 ఎకానమీతో 9 వికెట్లు తీశాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. 

ఎంఎస్‌ ధోని(MS Dhoni)
టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌, బెస్ట్‌ ఫినిషర్, అత్యుత్తమ వికెట్‌ కీపర్‌.. ఇలా ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు సాధించిపెట్టిన సారథి. ముఖ్యంగా తొట్టతొలి టీ20 వరల్డ్‌కప్‌-2007 గెలిచిన జట్టుకు కెప్టెన్‌. అన్ని ఫార్మాట్లలోనూ సారథిగా తనదైన ముద్ర వేసిన ధోని... టీ20 క్రికెట్‌లో 185 క్యాచ్‌లు, 84 స్టంపింగ్‌లు చేసిన వికెట్‌కీపర్‌గా పేరొందాడు. 6861 పరుగులు(స్ట్రైక్‌ రేటు- 134.82) చేసి బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. 

కీరన్‌ పొలార్డ్‌(Kieron Pollard)
ఆరంభంలో తడబడినా.. రానురాను తనదైన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌కే పర్యాయపదంగా మారాడు పొలార్డ్‌. గేల్‌ తర్వాత అంతటి హిట్టర్‌గా పేరొందాడు. టీ20 ఫార్మాట్‌లో 298 వికెట్లు తీసిన ఈ ఆల్‌రౌండర్‌.. 2012లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన విండీస్‌ జట్టులో సభ్యుడిగా, 2016లో జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌గా ప్రశంసలు అందుకున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఈసారి బరిలోకి దిగనున్న వెస్టిండీస్‌ జట్టుకు అతడే సారథి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  

విండీస్‌ టీ20 జట్టు ఇదే:
కీరన్ పొలార్డ్ (కెప్టెన్‌), నికోలస్ పూరన్ (వైస్‌ కెప్టెన్‌), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్‌, లెండెల్ సిమన్స్, ఒస్నేన్ థామస్, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌

స్టాండ్‌ బై ప్లేయర్లు: జాసన్‌ హోల్డర్‌, డారెన్‌ బ్రావో, షెల్డన్‌ కాట్రెల్‌, ఏకేల్ హోసిన్.

-వెబ్‌డెస్క్‌
చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement