చెలరేగిన ముస్తాఫిజుర్.. 26 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం
154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆరంభంలో నిలకడగా ఆడినప్పటికీ, చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 26 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బంగ్లా బౌలర్లు ముస్తాఫిజుర్, షకీబ్ ధాటికి ఒమన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ దశలో బంగ్లాదేశ్‌కు మరో ఓటమి ఖాయమయ్యేలా కనిపించినా, బంగ్లా బౌలర్లు తేరుకుని ఒమన్‌ను కట్టడి చేశారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 4 వికెట్లతో చెలరేగగా, షకీబ్ 3, సైఫుద్దీన్, మెహిదీ హసన్ తలో వికెట్ పడగొట్టారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో జతిందర్ సింగ్(40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
లక్ష్యం దిశగా సాగుతున్న ఒమన్.. 15 ఓవర్ల తర్వాత 100/4
ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లా జట్టుకు మరో పరాభవం తప్పేలా లేదు. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. లక్ష్యం దిశగా సాగుతుంది. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 100/4. క్రీజ్‌లో అయాన్ ఖాన్(11 బంతుల్లో ), సందీప్ గౌడ్(6 బంతుల్లో 4) ఉన్నారు. ఒమన్ గెలవాలంటే 30 బంతుల్లో 54 పరుగులు చేయాలి.
10 ఓవర్ల తర్వాత ఒమన్ స్కోర్ 70/2
154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ముస్తాఫిజుర్ వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతికి నరుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి కశ్యప్ ప్రజాపతి(18 బంతుల్లో 21) ఔట్ కాగా.. జతిందర్(25 బంతుల్లో 30), జీషన్ మక్సూద్(4) నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఒమన్ స్కోర్ 70/2గా ఉంది.
ధాటిగా ఆడుతున్న ఒమన్.. 5 ఓవర్ల తర్వాత 40/1
154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. 2వ ఓవర్‌లోనే వికెట్ కోల్పోయినప్పటికీ ధాటిగా ఆడుతుంది. ముస్తాఫిజుర్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి ఒమన్ ఓపెనర్ ఆకిబ్ ఇలియాస్(6 బంతుల్లో 6) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగగా.. కశ్యప్ ప్రజాపతి(15 బంతుల్లో 15), జతిందర్(9 బంతుల్లో 10) ధాటిగా ఆడుతున్నారు. 5 ఓవర్ల తర్వాత ఒమన్ స్కోర్ 40/1.
ఒమన్ బౌలర్ల విజృంభన.. బంగ్లాదేశ్ 153 ఆలౌట్
ఆఖరి 5 ఓవర్లలో ఒమన్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌటైంది. 17వ ఓవర్‌లో కలీముల్లా.. అఫీఫ్ హోసేన్(5 బంతుల్లో 1), మహ్మద్ నయీమ్(50 బంతుల్లో 64; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)ల వికెట్లు పడగొట్టగా.. 19వ ఓవర్‌లో ఫయాజ్ బట్ వరుస బంతుల్లో.. ముష్ఫికర్(4 బంతుల్లో 6), సైఫుద్దీన్(0)లను ఔట్ చేసి బంగ్లా భారీ స్కోర్ ఆశలకు గండికొట్టాడు. ఆఖరి ఓవర్ బౌల్ చేసిన బిలాల్ ఖాన్.. మహ్మదుల్లా(10 బంతుల్లో 17), ముస్తాఫిజుర్(2)లకు ఔట్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ 153 పరుగుల వద్ద ముగిసింది. ఒమన్ బౌలర్లు ఫయాజ్ బట్, బిలాల్ ఖాన్ తలో 3 వికెట్లు సాధించగా.. కలీముల్లా 2, జీషన్ మక్సూద్ ఓ వికెట్ పడగొట్టారు.
గేర్ మార్చిన బంగ్లా బ్యాటర్లు.. 15 ఓవర్ల తర్వాత 112/4
మొదటి 10 ఓవర్లలో ఆచితూచి ఆడిన బంగ్లా బ్యాటర్లు ఆ తర్వాత గేర్ మార్చారు. 10కిపైగా సగటుతో పరుగులు స్కోర్ చేస్తున్నారు. 13.3 ఓవర్లో షకీబ్(29 బంతుల్లో 42; 6 ఫోర్లు) రనౌట్ కాగా, 15వ ఓవర్ ఆఖరి బంతికి జీషన్ మక్సూద్ బౌలింగ్‌లో సందీప్ గౌడ్‌కు క్యాచ్ ఇచ్చి నరుల్ హసన్(4 బంతుల్లో 3) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 112/4. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(46 బంతుల్లో 56), అఫీఫ్ హోసేన్ ఉన్నారు.
10 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 63/2
తొలి ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన బంగ్లా జట్టు ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపిస్తోంది. 5 నుంచి 10 ఓవర్లలో మరో వికెట్ కోల్పోకుండా 38 పరుగులు జోడించింది. 10 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 63/2. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(31 బంతుల్లో 32), షకీబ్ అల్ హసన్(18 బంతుల్లో 22) ఉన్నారు.
5 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 25/2
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ మరోసారి చెత్త బ్యాటింగ్ ప్రదర్శనను కొనసాగిస్తుంది. తొలి 5 ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు (లిటన్ దాస్(6), మెహిదీ హసన్(0)) కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 5 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(13), షకీబ్ అల్ హసన్(4) ఉన్నారు. ఒమన్ బౌలర్లు ఫయాజ్ బట్, బిలాల్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, తొలి మ్యాచ్‌లో బంగ్లా జట్టు పసికూన స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసినా సంగతి తెలిసిందే.
అల్ అమీరట్: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్-బీ మ్యాచ్‌లో ఒమన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
ఒమన్: జతిందర్ సింగ్, ఆకిబ్ ఇలియాస్, కశ్యప్ ప్రజాపతి, జీషన్ మక్సూద్(కెప్టెన్), నసీం ఖుషి(వికెట్ కీపర్), మహ్మద్ నదీం, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, కలీముల్లా, బిలాల్ ఖాన్, ఫయాజ్ బట్
బంగ్లాదేశ్: లిటన్ దాస్, మహ్మద్ నయీమ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మహ్మదుల్లా(కెప్టెన్), అఫిఫ్ హోసేన్, నరుల్ హసన్, మెహిదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
Comments
Please login to add a commentAdd a comment