5 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం
బంగ్లాదేశ్ నిర్ధేశించిన 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక మరో 7 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుని 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చరిత్ అసలంక(49 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్స(31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి బ్యాటింగ్ చేయడంతో శ్రీలంక 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్, నసుమ్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సైఫుద్దీన్‌కు ఓ వికెట్ దక్కింది. 80 పరుగులతో అజేయంగా నిలిచిన అసలంకకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. హసరంగ(6) ఔట్
భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడుతుంది. 8 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. షకీబ్ వేసిన 9వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన లంక.. 10వ ఓవర్ నాలుగో బంతికి హసరంగ(5 బంతుల్లో 6; ఫోర్) వికెట్‌ను కూడా చేజార్చుకుంది. 10 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 80/4 .క్రీజ్‌లో అసలంక(46), భానుక రాజపక్స ఉన్నారు.
చెలరేగిన షకీబ్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
ఇన్నింగ్స్ 9వ ఓవర్ బౌల్ చేసిన షకీబ్ చెలరేగిపోయాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంకకు దెబ్బ కొట్టాడు. తొలి బంతికి నిస్సంక(21 బంతుల్లో 24; ఫోర్, సిక్స్)ను క్లీన్ బౌల్డ్ చేసిన షకీబ్.. నాలుగో బంతికి అవిష్క ఫెర్నాండోను సైతం క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు సాగనంపాడు. ఈ క్రమంలో అతను ఓ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు(41) పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు పాక్ స్పిన్నర్ అఫ్రిది(39) పేరిట ఉండేది. 9 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 72/3. క్రీజ్‌లో చరిత్ అసలంక(44), హసరంగ(1) ఉన్నారు.
శ్రీలంక టార్గెట్ 172.. తొలి ఓవర్‌లోనే షాక్
బంగ్లాదేశ్ నిర్ధేశించిన 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంకకు తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నసుమ్ అహ్మద్ బౌలింగ్‌లో బిగ్ హిట్టర్ కుశాల్ పెరీరా(3 బంతుల్లో 1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో శ్రీలంక 2 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్లో పథుమ్ నిస్సంక(1), చరిత్ అసలంక ఉన్నారు.
రాణించిన బంగ్లా బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ 172
బంగ్లా బ్యాటర్లు మహ్మద్ నయీమ్(52 బంతుల్లో 62; 6 ఫోర్లు), ముష్ఫికర్ రహీమ్(37 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ సాధించింది. వీరికి తోడు మిగతా బ్యాటర్లు కూడా తలో చేయి వేయడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కరుణరత్నే, బినుర ఫెర్నాండో, లహీరు కుమార తలో వికెట్ పడగొట్టారు.
అఫీఫ్ హొసేన్(7) రనౌట్.. బంగ్లాదేశ్ 150/4
ఇన్నింగ్స్ 18.3 ఓవర్లో అఫీఫ్ హొసేన్(6 బంతుల్లో 7; ఫోర్) రనౌటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 150 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో ఉన్న ముష్ఫికర్ రహీమ్(32 బంతుల్లో 50) అర్ధ సెంచరీ సాధించి.. జోరుమీదుండగా, మహ్మదుల్లా అతనికి జత కలిశాడు.
బంగ్లాదేశ్ మూడో వికెట్ డౌన్.. నయీమ్(62) ఔట్
అర్ధసెంచరీ సాధించి మాంచి జోష్ మీదున్నట్లు కనపించిన బంగ్లా ఓపెనర్ మహ్మద్ నయీమ్(52 బంతుల్లో 62; 6 ఫోర్లు)ను బినుర ఫెర్నాండో బోల్తా కొట్టించాడు. పుల్ షాట్ ఆడే క్రమంలో లీడింగ్ ఎడ్జ్ తీసుకోవడంతో ఫెర్నాండోకే క్యాచ్ ఇచ్చి నయీమ్ వెనుదిరిగాడు. 16.1 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 129/3. క్రీజ్‌లో ముష్ఫికర్ రహీమ్(24 బంతుల్లో 37), అఫీఫ్ హొసేన్ ఉన్నారు.
నయీమ్ హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా బంగ్లా
56 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను ఓపెనర్ మహ్మద్ నయీమ్(44 బంతుల్లో 51; 4 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి మరో ఎండ్‌లో ముష్ఫికర్ రహీమ్(17 బంతుల్లో 24; 2 సిక్సర్లు) సహకరించడంతో బంగ్లా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 14 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 107/2.
బంగ్లా రెండో వికెట్ డౌన్.. షకీబ్(10) క్లీన్ బౌల్డ్
ఇన్నింగ్స్ 8వ ఓవర్ నాలుగో బంతికి బంగ్లాదేశ్‌కు రెండో షాక్ తగిలింది. కరుణరత్నే బౌలింగ్‌లో షకీబ్ అల్ హసన్(7 బంతుల్లో 10; 2 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 8 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 58/2. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(29), ముష్ఫికర్ రహీమ్(1) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. లిటన్ దాస్(16) ఔట్
ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఐదో బంతికి బంగ్లాదేశ్‌కు తొలి షాక్ తగిలింది. లహీరు కుమార బౌలింగ్‌లో శనక క్యాచ్ పట్టడంతో లిటన్ దాస్(16 బంతుల్లో 16; 2 ఫోర్లు) పెవిలియన్ బాట పట్టాడు. 6 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 41/1. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(21 బంతుల్లో 22; 2 ఫోర్లు), షకీబ్ అల్ హసన్(1) ఉన్నారు.
బంగ్లాదేశ్ శుభారంభం.. 5 ఓవర్ల తర్వాత 38/0
టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్(18 బంతుల్లో 21; 2 ఫోర్లు), లిటన్ దాస్(14 బంతుల్లో 15; 2 ఫోర్లు) నిలకడగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ 5 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 38 పరుగులు స్కోర్ చేసింది.
షార్జా: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ 12కు అర్హత సాధించే క్రమంలో శ్రీలంక ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా, బంగ్లాదేశ్.. 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొందింది. గ్రూప్ బీ క్వాలిఫయర్స్‌లో బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఇక ముఖాముఖి పోరు విషయానికొస్తే..
పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల 11 సార్లు తలపడగా.. శ్రీలంక 7, బంగ్లాదేశ్ 4 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్‌లో కూడా శ్రీలంకదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్‌లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) శ్రీలంక మంచి ట్రాక్ రికార్డే కలిగి ఉంది. 2 సార్లు ఫైనలిస్ట్(2009, 2012)గా.. ఓసారి ఛాంపియన్(2014)గా నిలిచింది. మరోవైపు ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది.
తుది జట్లు:
శ్రీలంక: కుశాల్ పెరీరా(వికెట్‌కీపర్), పథుమ్ నిస్సంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, దసున్ శనక(కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో, లహీరు కుమార
బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లాష(కెప్టెన్), అఫీఫ్ హొసేన్, నరుల్ హసన్(వికెట్‌కీపర్), మెహిది హసన్, మహ్మద్ సైఫుద్దీన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహీమ్
Comments
Please login to add a commentAdd a comment