బౌలర్ల విజృంభణ.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం
సమయం 18:31.. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 85 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కూడా ఆరంభంలో తడబడినప్పటికీ.. కెప్టెన్ బవుమా(28 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), డస్సెన్(27 బంతుల్లో 22; 2 ఫోర్లు) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. సఫారిలు 13.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు దక్కించుకోగా.. మెహిది హసన్, నసుమ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు సఫారి పేసర్లు రబాడ(3/20), నోర్జే(3/8), ప్రిటోరియస్(1/11) నిప్పులు చెరగడంతో బంగ్లా జట్టు 18.2 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది.
మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. మార్క్రమ్ డకౌట్
సమయం 17:51.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా కూడా తడబడుతుంది. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో నయీమ్‌కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ డకౌటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 33/3. క్రీజ్‌లో డస్సెన్, బవుమా ఉన్నారు.
టార్గెట్ 85.. రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
సమయం 17:46.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. మెహిది హసన్ బౌలింగ్‌లో డికాక్(15 బంతుల్లో 16; 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 28 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో డస్సెన్(5), మార్క్రమ్ ఉన్నారు.
టార్గెట్ 85.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా కూడా ఆరంభంలోనే తడబడింది. తొలి ఓవర్ ఆఖరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో హెండ్రిక్స్(5 బంతుల్లో 4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి ఓవర్ తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 6/1. క్రీజ్‌లో డికాక్, డస్సెన్ ఉన్నారు.
84 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో కేవలం 84 పరుగులకే కుప్పకూలింది. 17.2వ ఓవర్లో తస్కిన్ అహ్మద్(5 బంతుల్లో 3) రనౌట్ కాగా, నోర్జే వేసిన ఆ మరుసటి ఓవర్‌లో(18.1) మెహిది హసన్(25 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్), నసుమ్ అహ్మద్(0) ఔట్ కావడంతో బంగ్లా ఇన్నింగ్స్ 84 పరుగుల వద్ద ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మెహిది హసన్(27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారి బౌలర్లలో రబాడ, నోర్జే చెరో మూడు వికెట్లు దక్కించుకోగా.. షంషి 2, ప్రిటోరియస్ ఓ వికెట్ పడగొట్టారు.
64 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
సమయం 16:52.. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో షంషి మరో వికెట్ పడగొట్టాడు. 15.2వ ఓవర్లో షమీమ్ హెసేన్(20 బంతుల్లో 11) ఔట్ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 64 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో మెహిది హసన్, తస్కిన్ అహ్మద్ ఉన్నారు.
45 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
సమయం 16:35.. సఫారి బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ విలవిలలాడుతుంది. 45 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. షంషి వేసిన 11.3వ ఓవర్లో లిటన్ దాస్(36 బంతుల్లో 24; ఫోర్) ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 46/6. క్రీజ్‌లో షమీమ్ హెసేన్(4), మెహిది హసన్(1) ఉన్నారు.
చెలరేగుతున్న సఫారి పేసర్లు.. 34 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
సమయం 16: 16.. సఫారి పేసర్లు చెలరేగిపోతున్నారు. బంగ్లా బ్యాటింగ్ లైనప్‌పై విరుచుకుపడుతున్నారు. తొలుత రబాడ వరుస బంతుల్లో వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ నడ్డి విరచగా.. తాజాగా నోర్జే, ప్రిటోరియస్ వరుస బంతుల్లో వికెట్లు తీసి బంగ్లాను కోలుకోలేని దెబ్బకొట్టారు. నోర్జే వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతికి మహ్మదుల్లా(9 బంతుల్లో 3) క్యాచ్ ఔట్ కాగా.. ఆ మరుసటి బంతికే ప్రిటోరియస్ బౌలింగ్‌లో అఫీఫ్ హెసేన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5. క్రీజ్‌లో లిటన్ దాస్(19), షమీమ్ హెసేన్(1) ఉన్నారు.
దడదడలాడిస్తున్న రబాడ.. 5 బంతుల్లో 3 వికెట్లు
సమయం 15: 57.. ఇన్నింగ్స్ నాలుగో నాలుగో ఓవర్‌లో ఆఖరి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టిన రబాడ 6వ ఓవర్‌లో మరోసారి చెలరేగాడు. 5.3వ ఓవర్లో ముష్ఫికర్ రహీమ్(0) పెవిలియన్‌కు పంపి బంగ్లాదేశ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఫలితంగా బంగ్లా జట్టు 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. క్రీజ్‌లో లిటన్ దాస్(14), మహ్మదుల్లా ఉన్నారు.
దడదడలాడించిన రబాడ.. వరుస బంతుల్లో వికెట్లు
సమయం 15: 49.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగాదేశ్‌ను రబాడ దడదడలాడించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఆఖరి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను భారీ దెబ్బ కొట్టాడు. తొలుత నయీమ్(11 బంతుల్లో 9; ఫోర్)ను ఔట్ చేసిన రబాడ.. మరుసటి బంతికే సౌమ్య సర్కార్(0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 4 ఓవర్లలో 22 పరగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్ ఉన్నారు.
అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా మంగళవారం(నవంబర్ 2) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్టు ఇప్పటివరకు చెరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. దక్షిణాఫ్రికా 2 మ్యాచ్‌ల్లో గెలిచి(వెస్టిండీస్, శ్రీలంక) ఆసీస్ చేతిలో పరాజయంపాలవ్వగా.. సూపర్-12 దశలో బంగ్లాదేశ్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో(శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్) ఓటమిపాలై సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
ఇక పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఓవరాల్‌గా ఇరు జట్లు 6 సందర్భాల్లో తలపడగా.. 6 సార్లు దక్షిణాఫ్రికానే గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఒకే ఒక్కసారి తలపడగా.. ఆ మ్యాచ్‌లో సైతం దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్‌లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) ఇరు జట్లు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేకపోయాయి. 2009, 2014లో సెమీస్‌కు చేరడమే దక్షిణాఫ్రికాకు అత్యుత్తమం కాగా, బంగ్లా 2007లో సూపర్ దశకు చేరుకోగలిగింది.
తుది జట్లు:
దక్షిణాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), డికాక్(వికెట్‌కీపర్), వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షమ్సీ
బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), సౌమ్య సర్కార్, మహ్మద్ నయీమ్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసేన్, మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం, షమీమ్ హొసేన్, నసుమ్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment