
హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో రెండో రోజూ భారత క్రీడాకారులు తమ పతకాల వేట కొనసాగించారు. తొలి రోజు సోమవారం 17 పతకాలు నెగ్గిన భారత ప్లేయర్లు... రెండో రోజు మంగళవారం ఏకంగా 18 పతకాలతో అదరగొట్టారు. ఇందులో నాలుగు స్వర్ణ పతకాలు ఉన్నాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి జీవంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 కేటగిరీలో పసిడి పతకాన్ని సాధించింది.
వరంగల్ జిల్లాలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి అందరికంటే వేగంగా 400 మీటర్ల దూరాన్ని 56.69 సెకన్లలో పూర్తి చేసి ఆసియా పారా గేమ్స్‌తోపాటు ఆసియా రికార్డును సృష్టించింది. మహిళల కనోయింగ్ ఎల్2 ఈవెంట్‌లో ప్రాచీ యాదవ్ 500 మీటర్ల దూరాన్ని 54.962 సెకన్లలో అధిగమించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది.
పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్54/55/56) కేటగిరీలో నీరజ్ యాదవ్ డిస్క్‌ను 38.56 మీటర్ల దూరాన్ని విసిరి విజేతగా నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల 5000 మీటర్ల (టి13 కేటగిరీ) విభాగంలో శరత్ శంకరప్ప 20ని:18.90 సెకన్లలో రేసును ముగించి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. రెండో రోజుల పోటీలు ముగిశాక భారత్ 10 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి మొత్తం 35 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment