ముఖం మాడ్చుకున్న రోహిత్‌: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్‌ | There Are Definitely 2 MI Teams Rohit Hardik Post Match Moment Video Fans Reacts | Sakshi
Sakshi News home page

ముఖం మాడ్చుకున్న రోహిత్‌: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్‌

Published Mon, Apr 8 2024 12:34 PM | Last Updated on Mon, Apr 8 2024 1:32 PM

There Are Definitely 2 MI Teams Rohit Hardik Post Match Moment Video Fans Reacts - Sakshi

ముంబై గెలిచినా ముఖం మాడ్చుకున్న రోహిత్‌ (PC: IPL X)

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మను కాదని హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం పెను దుమారమే రేపింది. ఐదుసార్లు టైటిల్‌ గెలవడమే కాకుండా.. టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌పై వేటు వేయడం అభిమానులకు మింగుడు పడలేదు.

ఫలితంగా మైదానంలో.. సోషల్‌ మీడియాలో రోహిత్‌ శర్మకు మద్దతుగా.. హార్దిక్‌ పాండ్యాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. పాండ్యాను గేలి చేస్తూ ప్రేక్షకులు అతడిపై కోపం వెళ్లగక్కారు. అందుకు తగ్గట్లుగానే అతడి సారథ్యంలో మొదటి మూడు మ్యాచ్‌లలో ముంబై ఓడిపోవడం వారి ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది.

ఈ నేపథ్యంలో సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.‍ దీంతో హార్దిక్‌ పాండ్యాతో పాటు ముంబై ఆటగాళ్లు, యజమానులు నీతా అంబానీ, ఆకాశ్‌ అంబానీ సంబరాలు అంబరాన్నంటాయి.

కానీ రోహిత్‌ శర్మ మాత్రం ముఖం మాడ్చుకున్నట్లుగా కనిపించింది. ఆటగాళ్లంతా సంతోషంగా హార్దిక్‌ పాండ్యాను ఆలింగనం చేసుకుంటూ అభినందించగా.. రోహిత్‌ మాత్రం పాండ్యాను హత్తుకునే సమయంలో సీరియస్‌గా ఉన్నాడు. 

ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతుండగా.. ముంబై విజయానంతరం రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా చేసిన ట్వీట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. రోహిత్‌ శర్మ ఎక్స్‌ వేదికగా.. రొమారియో షెఫర్డ్‌, ఢిల్లీ ఆటగాళ్లు, ముంబైని చీర్‌ చేసేందుకు వచ్చిన పిల్లల ఫొటోలు మాత్రమే పంచుకున్నాడు. గెలుపు బావుటా ఎగురవేశామన్నట్లుగా జెండా ఎమోజీ జత చేశాడు.

ఇందులో పాండ్యా గానీ మిగతా ముంబై ఆటగాళ్లకు కానీ చోటివ్వలేదు. అయితే, ముంబై కెప్టెన్‌గా తొలి విజయం అందుకున్న హార్దిక్‌ పాండ్యా మాత్రం.. ‘‘మేము గెలిచాం. ఇక ముందుకు పరిగెత్తుతాం’’ అంటూ తమ సంబరాలతో పాటు రోహిత్‌ శర్మ పరుగు తీస్తున్న ఫొటోను జోడించాడు.

ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా ఎంతగా కలుపుకొనిపోదామని చూసినా.. రోహిత్‌ శర్మ మాత్రం దూరం పాటిస్తున్నట్లు కనిపిస్తోందని పాండ్యా అభిమానులు అంటున్నారు. రోహిత్‌ కెప్టెన్సీ కోల్పోవడాన్ని అవమానంగా భావించడం వల్లే జట్టు గెలిచినా అతడి ముఖంలో ఆనందం కనిపించడం లేదని కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి గెలిచిన ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో పది నుంచి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. తదుపరి ఏప్రిల్‌ 11న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో ముంబై తలపడనుంది. వాంఖడే వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది.

చదవండి: IPL 2024 LSG Vs GT: మా బౌలర్లు అద్భుతం.. ఓటమికి వాళ్లే కారణం: శుబ్‌మన్‌ గిల్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement