వర్షం కారణంగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ రద్దైంది. దీంతో ఫైనలిస్ట్‌లు చెపాక్ సూపర్ గిల్లీస్ (సీఎస్‌జీ), లైకా కోవై కింగ్స్ (ఎల్‌కేకే) జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఆటను 17ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.
సాయి సుదర్శన్ (42 బంతుల్లో 65; 8ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఎల్‌కేకే ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గంగ శ్రీధర్ రాజు (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్), షారుక్ ఖాన్ (17 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించారు. సీఎస్‌జీ బౌలర్లలో సందీప్ వారియర్ (4/29), సాయి కిషోర్ (3/26), సోనూ యాదవ్ (2/29) సత్తా చాటారు.
అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన సీఎస్‌జీ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కౌశిక్ గాంధీ (1), ఎన్ జగదీషన్ (2) పరుగులకే ఔటవ్వగా.. ఎస్ రాధాకృష్ణన్ (11 బంతుల్లో 9; ఫోర్), రాజగోపాల్ సతీశ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ దశలో (4 ఓవర్లలో 14/2) మొదలైన వర్షం ఎంతకీ ఎడతెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సందీప్ వారియర్ దక్కించుకోగా.. సంజయ్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
చదవండి: బట్లర్ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్
Comments
Please login to add a commentAdd a comment