Tokyo Olympics 2021: Men's Hockey Team Historic win against Germany - Sakshi
Sakshi News home page

Tokyo Olympics Day 14: కాంస్యం పోరులో దీపక్‌ పునియా ఓటమి

Published Thu, Aug 5 2021 7:17 AM | Last Updated on Thu, Aug 5 2021 5:20 PM

Tokyo Olympics Day 14 August 5 Updates And Highlights In Telugu - Sakshi

► టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో భారత​ రెజ్లర్‌ దీపక్‌ పూనియా నిరాశ పరిచాడు. రెజ్లింగ్ 86 కేజీల విభాగంలో సాన్ మారినోకు చెందిన మైల్స్ నాజెల్ చేతిలో 2-4 తేడాతో ఓడిపోయాడు. దీంతో భారత్‌ తృటిలో మరో పతకం గెలుచుకునే అవకాశం కోల్పోయాడు.

► టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు . 57 కిలోల రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ విభాగంలో రష్యాకు చెందిన రెజ్లర్‌ జవుర్‌ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్‌ 7-4 తేడాతో ఓడి రజతం గెలుచుకున్నాడు. తద్వారా సుశీల్‌ కుమార్‌ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తాజాగా రవికుమార్‌ రజతంతో మెరవడంతో టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం పతకాల సంఖ్య ఐదుకి చేరింది. 

► టోక్యో ఒలింపిక్స్‌లో 20 కి.మీ. నడక రేసులో భారత అథ్లెట్లు నిరాశపరిచారు. ఆరంభంలో చైనా అథ్లెట్‌ వాంగ్‌కు భారత్‌ అథ్లెట్‌ సందీప్‌ కుమార్‌ గట్టిపోటీ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య కేవలం ఒక సెకన్‌ మాత్రమే ఉండడంతో హోరాహోరీగా కొనసాగింది. అయితే అదే టెంపోనూ సందీప్‌ చివరివరకు నిలబెట్టలేకపోయాడు. గంట 25 నిమిషాలు 7 సెకన్లలో రేసును ముగించిన సందీప్‌ ఓవరాల్‌గా 32వ స్థానంలో నిలవగా.. మరో భారత అథ్లెట్‌ రాహుల్‌ గంట 32 నిమిషాల 6 సెకన్లలో రేసు ముగించి 47వ స్థానంలో నిలిచాడు. ఇక ఇటలీకి చెందిన స్టానో మాసిమో గంట 21 నిమిషాల 05 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని స్వర్ణం గెలవగా.. జపాన్‌కు చెందిన ఇకిడా కోకి గంట 21 నిమిషాల 14 సెకన్లతో రజతం.. జపాన్‌కే చెందిన మరో అథ్లెట్‌ యమాన్షి తోషికాజు గంట 21 నిమిషాల 28 సెకన్లతో కాంస్యం గెలుచుకున్నాడు.

Tokyo Olympics Day 14 Updates: టోక్యో ఒలింపిక్స్‌లో 20 కి.మీ. నడక పోటీ హోరాహోరీగా సాగుతోంది. మొదటి స్థానంలో చైనా అథ్లెట్‌ వాంగ్‌ కొనసాగుతుండగా.. భారత్‌కు చెందిన సందీప్‌ కుమార్‌(హర్యానా) రెండో స్థానంలో ఉన్నాడు. వాంగ్‌కు, సందీప్‌కు మధ్య తేడా కేవలం ఒక సెకన్‌ మాత్రమే తేడా ఉండటం విశేషం. కాగా ఈ పోటీలో ముందున్న కాలు మడత పడకుండా నడవాలన్న నిబంధన ఉంటుంది.

అదే విధంగా... ఏదో ఒక కాలు కచ్చితంగా నేల మీదుండాలన్నది రెండో నిబంధన. సుమారు ఒక గంట 20 నిమిషాల పాటు ఈ రేసు సాగనుంది. ఇక 20కి.మీ. నడక రేసులో ఇప్పటివరకున్న ప్రపంచ రికార్డు 1గంట 16నిమిషాలు.


టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ అద్భుతం చేసింది. కాంస్యం కోసం జరిగిన పోరులో జర్మనీని 5-4 తేడాతో ఓడించి పతకంతో పాటు కోట్లాది మంది భారతీయుల మనసును గెలుచుకుంది. భారత్‌ తరఫున సిమ్రన్‌జీత్‌ రెండు, హార్దిక్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌, రూపీందర్‌ పాల్‌ సింగ్‌ ఒక్కో గోల్‌ చేశారు. తద్వారా సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత పురుషుల హాకీ జట్టు ఖాతాలో ఒలింపిక్స్‌ పతకం చేరింది. ఇక తాజాగా మన్‌ప్రీత్‌ సేన విజయంతో.. ఇప్పటి వరకు తాజా ఒలింపిక్స్‌లో భారత్‌ గెలిచిన పతకాల సంఖ్య మొత్తంగా ఐదుకు చేరింది.

భారత పురుషుల హాకీ జట్టు:
మన్‌ప్రీత్‌ సింగ్‌(కెప్టెన్‌), శ్రీజేశ్‌ పీఆర్‌(గోల్‌ కీపర్‌), అమిత్‌ రోహిదాస్‌, రూపీందర్‌సింగ్‌ పాల్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, సురేందర్‌ కుమార్‌, హార్దిక్‌ సింగ్‌, నీలకంఠ శర్మ, షంషేర్‌, సింగ్‌ మన్‌దీప్‌ సింగ్‌, దిల్‌ప్రీత్‌ సింగ్‌.

నిరాశ పరిచిన వినేశ్‌ ఫొగాట్‌
రెజ్లింగ్‌ మహిళల 53 కిలోల విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. క్వార్టర్‌ ఫైనల్‌లో భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ​బెలారస్‌కు చెందిన వనేసా చేతిలో 3-9 తేడాతో ఓటమి పాలైంది. అయితే, రెజిచేజ్‌ రూపంలో వినేశ్‌ కాంస్య పతకం గెలిచే ఆశలు సజీవంగానే ఉన్నాయి.  

భారత్‌- జర్మనీ హోరాహోరీ:
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం భారత్‌- జర్మనీ పురుషుల హాకీ జట్టు మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. చివరిదైన నాలుగో క్వార్టర్‌ ఉత్కంఠను రేపుతోంది. మూడో క్వార్టర్‌ వరకు భారత్‌ 5-3తో ఆధిక్యంలో కొనసాగగా.. ఆఖరి క్వార్టర్‌లో జర్మనీ తొలి గోల్‌ చేసి 5-4కు ఆధిక్యాన్ని తగ్గించింది. మరోసారి జర్మనీకి గోల్‌ చేసే అవకాశం వచ్చినా భారత డిఫెన్స్‌ టీం చక్కగా అడ్డుకుంది. ప్రస్తుతం స్కోరు 5-3గా ఉంది.

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం జర్మనీతో జరుగుతున్న పోరులో భారత పురుషుల హాకీ జట్టు అదరగొడుతోంది. మూడో క్వార్టర్‌ ఆరంభంలోనే రెండు గోల్స్‌ చేసి సత్తా చాటింది. పెనాల్టీ కార్నర్‌ రూపంలో వచ్చిన అవకాశాన్ని రూపీందర్‌ పాల్‌ సింగ్‌ చక్కగా సద్వినియోగం చేసుకుని ఈ క్వార్టర్‌లో భారత్‌కు పాయింట్‌ అందించగా.. సిమ్రన్‌జీత్‌ రెండో గోల్‌ సాధించాడు. తద్వారా మూడో క్వార్టర్‌ ముగిసే సరికి 5-3 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకో 15 నిమిషాల ఆట మిగిలి ఉంది.

వహ్వా వినేశ్‌
రెజ్లింగ్‌ మహిళల 53 కిలోల విభాగంలో భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్ సత్తా చాటింది. సోఫియా మగ్డలెనాను 7-1 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.
మీ అభిప్రాయం చెప్పండి: Tokyo Olympics 2020: భారత్‌ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు?

నిరాశపరిచిన అన్షుమాలిక్‌
రెజ్లింగ్‌ మహిళల 57 కిలోల రెపిచేజ్‌లో భారత మహిళా రెజ్లర్‌ అన్షుమాలిక్ నిరాశ పరిచింది. 1-5తేడాతో ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైంది.

అదరగొడుతున్న భారత్‌... 5-3తో ఆధిక్యంలో
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం జర్మనీతో జరుగుతున్న పోరులో మూడో క్వార్టర్‌ ముగిసే సరికి భారత్‌ 5-3 తేడాతో ఆధిక్యంలో ఉంది.

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం భారత్‌- జర్మనీ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. నిమిషాల వ్యవధిలో ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠను రేపుతోంది. మూడో క్వార్టర్‌ ఆరంభంలోనే భారత్‌ నాలుగో గోల్‌ చేసి 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పెనాల్టీ కార్నర్‌ రూపంలో వచ్చిన అవకాశాన్ని రూపీందర్‌ పాల్‌ సింగ్‌ చక్కగా సద్వినియోగం చేసుకుని భారత్‌కు పాయింట్‌ అందించాడు.

రెండో క్వార్టర్‌ ముగిసే సరికి రెండు జట్లు మూడేసి గోల్స్‌తో (3-3) సమంగా ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్‌ తరఫున సిమ్రన్‌జీత్‌, హార్దిక్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ ఒక్కో గోల్‌ చేశారు. చివరి రెండు గోల్స్‌ పెనాల్టీ కార్నర్‌ ద్వారా లభించాయి. ఇక జర్మనీకి తైమూర్‌ ఓరుజ్‌, నిక్లాస్‌ వెలెన్‌, బెనెడిక్ట్‌ మూడు పాయింట్లు అందించారు.

కాంస్యం కోసం భారత పురుషుల హాకీ జట్టు జర్మనీతో పోరాడుతోంది. రెండో క్వార్టర్‌లో జర్మనీ వరుసగా రెండు గోల్స్‌ కొట్టి 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, వెంటనే భారత్‌ సైతం గోల్‌ కొట్టి జర్మనీ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించింది. ఈసారి హార్దిక్‌ సింగ్‌ భారత్‌కు పాయింట్‌ అందించాడు. ఇక అంతకుముందు సిమ్రన్‌జీత్‌ గోల్‌తో భారత్‌కు ఒక పాయింట్‌ దక్కింది.

రెండో క్వార్టర్‌లో సిమ్రన్‌జీత్‌ గోల్‌ కొట్టి భారత్‌కు శుభారంభం అందించాడు. తాజా ఒలింపిక్స్‌లో అతడికిది రెండో గోల్‌. ప్రస్తుతం స్కోరు 1-1 సమంగా ఉంది.


గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌ తొలి క్వార్టర్‌ ముగిసే సరికి జర్మనీ గోల్‌ కొట్టి 1-0తో ఆధిక్యంలో ఉంది. జర్మనీ ప్లేయర్‌ తైమూర్‌ ఓరుజ్‌ ఈ మ్యాచ్‌లో తొలి గోల్‌ నమోదు చేశాడు. మరోవైపు... జర్మనీకి చివరి నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ అవకాశం వచ్చినా భారత డిఫెన్స్‌ చక్కగా అడ్డుకుని మరో గోల్‌ కొట్టకుండా అడ్డుకుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో నేటి భారత్‌ షెడ్యూల్‌
ఉదయం 7 గంటలకు హాకీ పురుషుల కాంస్య పతక పోరు
ఉ.7:30 నుంచి రెజ్లింగ్‌ మహిళల 57 కిలోల రెపిచేజ్‌ (అన్షుమాలిక్‌)
ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్‌ మహిళల 53 కిలోల విభాగం (వినేశ్‌ ఫొగాట్‌)
మధ్యాహ్నం ఒంటిగంట నుంచి అథ్లెటిక్స్‌ పురుషుల 20 కి.మీ నడక ఫైనల్‌
మధ్యాహ్నం 2:45 నుంచి రెజ్లింగ్‌ మహిళల 57 కిలోల కాంస్య పతక పోరు
మధ్యాహ్నం 2:45 నుంచి రెజ్లింగ్‌ మహిళల 53 కిలోల విభాగం సెమీస్‌
మ.2:45 నుంచి పురుషుల 57 కిలోల విభాగం ఫైనల్‌ (రవికుమార్‌ దహియా)
మ.2:45 నుంచి పురుషుల 86 కిలోల కాంస్య పతక పోరు (దీపక్‌ పునియా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement