
టోక్యో: ‘‘ఇది నిజంగా బాధాకరమైన రోజు. అతిముఖ్యమైన మ్యాచ్‌లో ఓడిపోయాం. ముఖ్యంగా పెనాల్టీ కార్నర్ల విషయంలో పెద్ద తప్పులు చేశాం. అయితే, ఇప్పటికీ కాంస్యం గెలిచే అవకాశం ఉంది కదా. కాబట్టి పతకం గెలిచేందుకు మేం పూర్తిగా కృషి చేస్తాం. అన్ని విధాలా సన్నద్ధమవుతాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం. మాకు ఇంకొక్క రోజు.. ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి తప్పకుండా పోరాడతాం. ఒకరికొకరం పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటూ మమ్మల్ని మేం సన్నద్ధం చేసుకుంటాం’’ అని భారత పురుషుల హాకీ జట్టు స్టార్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు. సెమీస్‌లో ఓడినప్పటికీ కాంస్య పతక పోరులో తప్పక గెలిచితీరతామని విశ్వాసం వ్యక్తం చేశాడు.
అదే విధంగా... స్టార్ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ చాంపియన్‌తో మ్యాచ్ అంత సులభమేమీకాదు. కొన్ని తప్పిదాలు జరిగాయి. మ్యాచ్ స్వరూపమే మారిపోయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. కాగా మంగళవారం నాటి టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. దేశమంతా సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ మ్యాచ్‌లో పరాజయం ఎదురుకావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు మెరుగైన ప్రదర్శన కనబరిచారని, తదుపరి మ్యాచ్‌లో ఇంకా బాగా ఆడాలని ఆకాంక్షించారు. కాగా సెమీస్-2లో ఓడిన జట్టుతో భారత్ కాంస్య కోసం తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment