
టోక్యో: ఒలింపిక్స్‌లో పతకం సాధించే అథ్లెట్లకు నిర్వహకులు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. పతకం గెలిచాక అథ్లెట్లు పోడియంపై నిల్చున్న సమయంలో ఫొటోలకు పోజులివ్వడానికి 30 సెకన్ల పాటు మాస్కులు తీసివేసే అవకాశం కల్పించారు. అయితే ఈ అవకాశాన్ని అథ్లెట్లు దుర్వినియోగం చేయొద్దని నిర్వాహకులు కోరారు. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సోమవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
కాగా, ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అథ్లెట్లు బరిలో ఉన్నప్పుడు మినహా అన్ని సమయాల్లో మాస్కులు ధరించే ఉండాలని నిబంధనలు జారీ చేశారు. అయితే మాస్కుల విషయంలో తాజాగా లభించిన వెసులుబాటుకు అథ్లెట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్లకు రోజూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.