అంతర్జాతీయ టోర్నీలలో ఎన్ని పతకాలు గెలిచినా రాని గుర్తింపు ఒలింపిక్స్ క్రీడల్లో సాధిస్తే రాత్రికి రాత్రే వస్తుంది. విశ్వ క్రీడల్లో విజయకేతనం ఎగురవేయాలని... అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రతి క్రీడాకారుడు భావిస్తాడు. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటికే తమదైన ముద్ర వేసిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ఒకటికంటే ఎక్కువ పతకాలు సాధించి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మరికొందరు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేరు గడించాలని ప్రయత్నిస్తున్నారు. నేటి నుంచి మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడాభిమానులు తప్పక చూడాల్సిన కొందరు క్రీడాకారులు ఉన్నారు. వారి గురించి క్లుప్తంగా...
–సాక్షి క్రీడా విభాగం
మెరుపుతీగ... సిమోన్ బైల్స్
అమెరికా జిమ్నాస్ట్ మెరుపుతీగ సిమోన్ బైల్స్. జిమ్నాస్టిక్స్‌పై ఆసక్తి ఉన్నవారికి సిమోన్ విన్యాసాలు బాగా తెలుసు. ముఖ్యంగా కరోనా కారణంగా లభించిన వాయిదా సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. ఈ ఒలింపిక్స్‌లో కను రెప్ప వేయకుండా చూసే ఈవెంట్ ఏదైనా ఉంటే అది బైల్స్ విన్యాసమే అవుతుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన 24 ఏళ్ల బైల్స్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది. టోక్యోలోనూ ఆమె ఐదు స్వర్ణాలపై గురి పెట్టింది.
బ్రొమెల్... బోల్ట్ వారసుడవుతాడా!
బీజింగ్ (2008) మొదలు రియో (2016) ఒలింపిక్స్ దాకా స్ప్రింట్‌లో జమైకన్ ఉసేన్ బోల్ట్ హవానే నడిచింది. అతనేమో రిటైరయ్యాడు. మరి ఇప్పుడెవరా పందెం కోడి అంటే... ట్రేవోన్ బ్రోమెల్ పేరు బాగా వినిపిస్తోంది. 25 ఏళ్ల ఈ అమెరికన్ స్ప్రింటర్ వేగంలో మరో చిరుతను, బోల్ట్‌ను తలపిస్తున్నాడు. ఇటీవల జరిగిన అమెరికా ట్రయల్స్‌లో అతను 100 మీటర్ల పరుగు పందెంను 9.80 సెకన్లలో పూర్తిచేసి అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. టోక్యోలోనూ ఈ వేగం నమోదైతే మూడు ఒలింపిక్స్‌ల తర్వాత విజేతగా నిలిచిన అమెరికన్ చిరుతగా నిలుస్తాడు. 2004 ఏథెన్స్‌లో గ్యాట్లిన్ పసిడి అనంతరం మరో అమెరికన్ గోల్డెన్ చాన్స్ కొట్టలేకపోయారు.
లేడీ చిరుత... షెల్లీ
జమైకన్ లేడీ చిరుత ఫ్రేజర్. గత రియో ఒలింపిక్స్‌లో స్ప్రింట్ (100 మీ.)లో కాంస్య పతకం పొందిన ఈ జమైకా అథ్లెట్ తన పరుగుకు ఈ నాలుగేళ్లలో మరింత వేగాన్ని జోడించింది. మహిళల 100 మీటర్ల పరుగులో విజయమైనా, స్వర్ణమైనా తనదేనని చెబుతున్నారంతా. ఆమె పసిడిపై కన్నేసింది. మనం ఆమె పరుగుపై కన్నేద్దాం. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న షెల్లీ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించింది.
బంగారు చేప... కెటీ లెడెక్కీ
మహిళల ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో కేటీ లెడెక్కీకి అద్భుతమైన రికార్డు ఉంది. మూడోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన లెడెక్కీ మరిన్ని స్వర్ణాలు తన మెడలో వేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఆమె ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది. మనం కూడా లెడెక్కీ విన్యాసంపై ఓ లుక్కెద్దాం.
గోల్డెన్ స్లామ్ దారిలో...
‘గోల్డెన్ స్లామ్’ వేట ఈ ఏడాది ఆస్ట్రేలియాలో మొదలైంది. ఫ్రెంచ్ ఓపెన్ మీదుగా వింబుల్డన్ దాకా సాగింది. ఇప్పుడు టోక్యో దగ్గరకు వచ్చింది. ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా... బలమైన ప్రత్యర్థులు లేని కారణంగా జొకోవిచ్‌కు ఒలింపిక్స్ స్వర్ణం దూరం కాబోదు. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి సెప్టెంబర్‌లో జరిగే యూఎస్ ఓపెన్‌లో జొకోవిచ్ విజేతగా నిలిస్తే... పురుషుల టెన్నిస్‌లో గోల్డెన్‌స్లామ్ సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టిస్తాడు.
సూపర్ ఫెలిక్స్...
అమెరికన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ మహిళా అథ్లెట్. షార్ట్ డిస్టెన్స్‌లో అసమాన ప్రదర్శన కనబరుస్తున్న 35 ఏళ్ల అలీసన్ పోటీని టోక్యోలో తప్పకుండా చూడాల్సిందే. అమెరికాలో నిర్వహించిన ట్రయల్స్‌లో మెరుపు వేగంతో పోటీల్ని ముగించిన ఫెలిక్స్ తాజా ఒలింపిక్స్‌లో మేటి రన్నర్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఫెలిక్స్ ఇప్పటివరకు ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించింది. ఒలింపిక్స్ మహిళల అథ్లెటిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా ఫెలిక్స్ గుర్తింపు పొందింది.
‘హ్యాట్రిక్’పై టెడ్డీ గురి...
ఫ్రాన్స్ జూడో ప్లేయర్ టెడ్డీ రినెర్ హ్యాట్రిక్ స్వర్ణం లక్ష్యంగా టోక్యో బరిలోకి దిగుతున్నాడు. లండన్, రియో విశ్వక్రీడల్లో బంగారు పతకాలు సాధించిన 32 ఏళ్ల రినెర్‌కు ఇది నాలుగో ఒలింపిక్స్. బీజింగ్ (2008) ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచాడు. ప్లస్ 100 కేజీల కేటగిరీలో పోటీపడే ఈ ఫ్రెంచ్ జూడోకా గత 154 బౌట్లలో ఓటమి ఎరుగని ఆటగాడిగా ఎదిగాడు.
Comments
Please login to add a commentAdd a comment