
టోక్యో/హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని భారత షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు అన్నారు. అందరి ప్రోత్సాహంతో పతకం సాధించానని, కోవిడ్ సమయంలో కూడా కఠోర శ్రమ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు సోమవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన విజయం వెనుక దాగున్న శ్రమ గురించి వెల్లడించారు.
‘‘డిఫెన్స్ మెరుగు కోసమే గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేశాను. గచ్చిబౌలిలో సదుపాయాలు కల్పించిన కేంద్రానికి కృతజ్ఞతలు. నా విజయంలో కోచ్ పాత్ర కీలకం. తన కుటుంబానికి దూరంగా ఉండి కోచ్ చాలా కష్టపడ్డాడు. నాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా విజయాన్ని దేశానికి, కుటుంబానికి అంకితమిస్తున్నాను. రియో ఒలింపిక్స్ తర్వాత ఆటలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకరించింది’’ అని సింధు చెప్పుకొచ్చారు. కాగా రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు.. తాజా టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిశారు.
Comments
Please login to add a commentAdd a comment