ఇస్లామాబాద్: రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రీడా జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తాను స్టార్ క్రికెటర్‌గా ఎదగడానికి ఇద్దరు ఆంటీలు(పిన్ని వరుస అయ్యేవారు) కారణమని పేర్కొన్నాడు. ప్రతి రోజు వారు తనని రెచ్చగొట్టేవారని, వారి మాటలతో మరింత కసిగా ప్రాక్టీస్ చేసేవాడినని చెప్పుకొచ్చాడు. వారు రోజు తనని ఎక్కడికి వెళ్తున్నావని అడిగేవారని, నేను స్టార్ అవుదామని వెళ్తున్నా అని చెప్పేవాడినని గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
అయితే, వారి మాటల్లో ఉద్దేశం నాకు నిధానంగా బోధ పడిందని అక్తర్ భావోద్వేగానికి లోనయ్యాడు. నేను స్టార్ ప్లేయర్ కావాలనే వారు నన్ను అలా రెచ్చగొట్టేవారని తెలిసిందని అన్నాడు. ఆ ఇద్దరు మహిళలే కాకుండా చుట్టు పక్కన వాళ్లు కూడా తనను ఎగతాళి చేసేవారని, నీకు క్రికెటర్ అయ్యేంత సీన్ లేదని రెచ్చగొట్టేవారని, వారి మాటలు తనలో మరింత కసిని రగిల్చాయని గుర్తు చేసుకున్నాడు. అయితే, నన్ను రెచ్చగొట్టినవారంతా నేను ఉన్నత స్థాయికి చేరాలనే అలా ప్రవర్తించేవారని తనకు తరువాత తెలిసిందని చెప్పుకొచ్చాడు.
ఇదంతా తన కెరీర్ ఆరంభంలో జరిగిన కథ అని అక్తర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా, అక్తర్ ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ తనని సొంత తమ్ముడిలా చూసుకొనేవారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తరఫున 46 టెస్ట్‌లు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడిన అక్తర్.. మొత్తంగా 444 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ ఆడే రోజుల్లో భారత్ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించిన అక్తర్.. రిటైర్మెంట్ ప్రకటించాక భారత్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఈ క్రికెట్ బంతి చాలా స్మార్ట్ గురూ.. సీపీఎల్-2021లో వినియోగం
Comments
Please login to add a commentAdd a comment