ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్-2024లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. తొలి ఎడిషన్‌లో నోయిడా సూపర్ కింగ్స్‌కు ప్రాతనిథ్యం వహించిన భువనేశ్వర్.. ఈ ఏడాది సీజన్‌లో మాత్రం లక్నో ఫాల్కన్స్ తరపున ఆడనున్నాడు. ఆదివారం జరిగిన యూపీ టీ20 లీగ్ వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను రూ. 30.25 లక్షల భారీ మొత్తానికి లక్నో ఫాల్కన్స్ కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా భువీ రికార్డులకెక్కాడు.
ఈ భారత వెటరన్ క్రికెటర్ కోసం కాన్పూర్ సూపర్ స్టార్స్ , గోరఖ్‌పూర్ లయన్స్ కూడా తీవ్రంగా శ్రమించాయి. కానీ వారి పర్స్‌లో తగినంత మొత్తం లేకపోవడంతో సదరు ఫ్రాంచైజీలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. అయితే లక్నో ఫాల్కన్స్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా అతడిపై భారీ మొత్తాన్ని వెచ్చింది. గత సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన భువీ 13 వికెట్లతో అదుర్స్ అన్పించాడు.
కాగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న భువనేశ్వర్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో కూడా ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2021 మెగా వేలంలో అతడిని ఎస్ఆర్‌హెచ్ రూ. 4.21 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక యూపీ టీ20 లీగ్-2024 సీజన్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో నితీష్ రాణా, శివమ్ మావి, వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా వంటి వారు భాగం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment