25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్‌! | Vaibhav Sooryavanshi Smashes 25 Ball 100 Runs In Kevin Pietersen Show, Sets Sights On T20 Double Century, Watch Video Inside | Sakshi
Sakshi News home page

25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్‌!

May 25 2026 3:57 PM | Updated on May 25 2026 5:25 PM

Vaibhav Sooryavanshi Smashes 25-Ball-100-Runs In Kevin Pietersen-Show

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఎక్కువ‌గా ట్రెండింగ్‌లో నిలిచిన పేరు వైభ‌వ్ సూర్య‌వంశీ. రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ఆడుతున్న ఈ 15 ఏళ్ల చిన్నోడు బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండ‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ నిర్వ‌హించిన యూట్యూబ్‌ షోలో పాల్గొన్న వైభ‌వ్ సూర్య‌వంశీ 25 బంతుల్లోనే సెంచ‌రీ సాధించి స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. 

విష‌యంలోకి వెళితే పీట‌ర్స‌న్ త‌న యూట్యూబ్ చానెల్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీతో ఒక ప్ర‌త్యేక ఎపిసోడ్ చేశాడు. ఆ ఎపిసోడ్‌లోనే పీట‌ర్స‌న్ వైభ‌వ్‌కు 50 బంతుల్లో 100 ప‌రుగులు చేయాలంటూ స‌వాల్ విసిరాడు. కానీ వైభ‌వ్ మాత్రం పీట‌ర్స‌న్ విసిరిన స‌వాల్‌ను 25 బంతుల్లోనే అందుకోవ‌డం విశేషం.  బౌలింగ్‌ మెషిన్ నుంచి వచ్చిన బంతుల‌ను వైభ‌వ్ భారీ సిక్స‌ర్లుగా మ‌లిచాడు. 

అయితే 25 బంతుల్లోనే శ‌త‌కం సాధించిన‌ప్ప‌టికీ ఇదే పీట‌ర్స‌న్ షోలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ 22 బంతుల్లో సాధించిన వంద ప‌రుగుల రికార్డును మాత్రం బ‌ద్ద‌లుకొట్ట‌లేక‌పోయాడు. మూడు బంతుల తేడాతో అయ్య‌ర్ రికార్డును బ్రేక్ చేసే అవ‌కాశాన్ని వైభ‌వ్ కోల్పోయాడు. ఇక పీట‌ర్స‌న్ షోలో అత్యంత వేగంగా సెంచ‌రీలు బాదిన ఆట‌గాళ్ల జాబితాలో వైభ‌వ్ సూర్య‌వంశీ రెండో స్థానంలో ఉన్నాడు. 

శ్రేయ‌స్ అయ్య‌ర్‌, వైభ‌వ్ త‌ర్వాత నికోల‌స్ పూరన్ (28 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు. అంత‌క‌ముందు ఏబీ డివిలియ‌ర్స్ 30 బంతుల్లో వంద ప‌రుగులు సాధించాడు. ఇక రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ 47 బంతుల్లో వంద ప‌రుగులు సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇదే ఎపిసోడ్‌లో సూర్య‌వంశీ త‌న కోరిక‌ను వెల్ల‌డించాడు. టీ20ల్లో డ‌బుల్ సెంచ‌రీ చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నాడు. 

అయితే టీ20 క్రికెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు విండీస్ దిగ్గ‌జం క్రిస్ గేల్ (175 ప‌రుగులు) పేరిట ఉంది. 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో గేల్ ఆర్సీబీ త‌ర‌ఫున 175 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడాడు. గేల్ రికార్డును బ‌ద్దలుకొట్ట‌డంతో పాటు టీ20ల్లో డ‌బుల్ సెంచ‌రీ బాద‌డ‌మే త‌న టార్గెట్ అని మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు.

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌పై 30 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన రాజ‌స్తాన్ 16 పాయింట్ల‌తో నాకౌట్ ద‌శ‌కు చేరుకుంది. బుధ‌వారం (మే 27న‌) జ‌ర‌గ‌నున్న ఎలిమినేట‌ర్ పోరులో ఎస్ఆర్‌హెచ్‌ను ఎదుర్కోనుంది. ఇక రాజ‌స్తాన్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ సీజ‌న్‌లో 14 మ్యాచ్‌లాడి 583 ప‌రుగులు సాధించాడు.

చదవండి: మెస్సీకి గాయం.. ఫిఫా ప్ర‌పంచ‌కప్‌కు దూరం!

Advertisement
 
Advertisement
Advertisement