వారెవ్వా!.. కరుణ్‌ నాయర్‌ ఐదో సెంచరీ.. సెమీస్‌లో విదర్భ | VHT Karun Nair 5th Ton Guides Vidarbha Into Semis Haryana Also Enters Top 4 | Sakshi
Sakshi News home page

వారెవ్వా!.. కరుణ్‌ నాయర్‌ ఐదో సెంచరీ.. సెమీస్‌లో విదర్భ

Published Mon, Jan 13 2025 10:12 AM | Last Updated on Mon, Jan 13 2025 11:26 AM

VHT Karun Nair 5th Ton Guides Vidarbha Into Semis Haryana Also Enters Top 4

శతకాల ధీరుడు కరుణ్‌ నాయర్‌(PC: BCCI)

హర్యానా కూడా టాప్‌-4లోకి

దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో హరియాణా, విదర్భ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో విదర్భ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించగా... హరియాణా జట్టు 2 వికెట్ల తేడాతో గుజరాత్‌ జట్టును ఓడించింది.

విదర్భతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కార్తీక్‌ శర్మ (62; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభమ్‌ గర్వాల్‌ (59; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలు సాధించగా... దీపక్‌ హుడా (45; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్‌ చహర్‌ (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ మహిపాల్‌ లోమ్రోర్‌ (32) తలా కొన్ని పరుగులు చేశారు.

విదర్భ బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అయితే సీనియర్‌ ప్లేయర్‌ కరుణ్‌ నాయర్‌ (82 బంతుల్లో 122 నాటౌట్‌; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు ముందు రాజస్తాన్‌ స్కోరు సరిపోలేదు. 

‘శత’క్కొట్టిన ధ్రువ్‌ షోరే
ఈ సీజన్‌లో వరుస సెంచరీలతో రికార్డులు తిరగరాస్తున్న విదర్భ కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ రాజస్తాన్‌ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నాడు. అతడితో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధ్రువ్‌ షోరే(Dhruv Shorey- 131 బంతుల్లో 118 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ‘శత’క్కొట్టడంతో విదర్భ జట్టు 43.3 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 292 పరుగులు చేసి గెలిచింది.

కరుణ్‌ నాయర్‌ ఐదో సెంచరీ
టీమిండియా ప్లేయర్లు దీపక్‌ చహర్, ఖలీల్‌ అహ్మద్, దీపక్‌ హుడా(Deepak Hooda) బౌలింగ్‌లో ధ్రువ్, కరుణ్‌ జంట పరుగుల వరద పారించింది. యశ్‌ రాథోడ్‌ (39) త్వరగానే అవుటవ్వగా... ధ్రువ్, కరుణ్‌ అబేధ్యమైన రెండో వికెట్‌కు 200 పరుగులు జోడించారు. 

తాజా సీజన్‌లో వరుసగా నాలుగు (ఓవరాల్‌గా 5) శతకాలు బాదిన కరుణ్‌ నాయర్‌... విజయ్‌ హజారే టోర్నీ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నారాయణ్‌ జగదీశన్‌ (5 శతకాలు; 2022–23లో) సరసన చేరాడు.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు 664 పరుగులు చేసిన 33 ఏళ్ల కరుణ్‌ నాయర్‌ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్రతో విదర్భ తలపడుతుంది.  

హరియాణా ఆల్‌రౌండ్‌ షో 
గుజరాత్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో హరియాణా సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 45.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. హేమంగ్‌ పటేల్‌ (54; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరవగా... చింతన్‌ గాజా (32; 4 ఫోర్లు), ఉర్విల్‌ పటేల్‌ (23; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఆర్య దేశాయ్‌ (23; 5 ఫోర్లు), సౌరవ్‌ చౌహాన్‌ (23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తలా కొన్ని పరుగులు చేశారు.

కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (3) విఫలమయ్యాడు. హరియాణా బౌలర్లలో అనూజ్‌ ఠక్రాల్, నిశాంత్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా... అన్షుల్‌ కంబోజ్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో హరియాణా 44.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. 

హిమాన్షు రాణా (66; 10 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. గుజరాత్‌ బౌలర్లలో టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు తీశాడు. అనూజ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో కర్ణాటకతో హరియాణా జట్టు తలపడనుంది. 

చదవండి: IPL 2025: కెప్టెన్‌ పేరును ప్రకటించిన పంజాబ్‌ కింగ్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement