టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి సంబంధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 2014లో కోహ్లి తన సాయం కోరాడని, బ్యాటింగ్‌లో లోటుపాట్ల గురించి చర్చించేందుకు తన కోసం సమయం వెచ్చించమని రిక్వెస్ట్ చేశాడని తెలిపాడు.
ఆ సమయంలో కోహ్లి ఫామ్ కోల్పోయి (ఇంగ్లండ్ సిరీస్) తంటాలు పడుతున్నాడని గుర్తు చేసుకున్నాడు. ఆటగాళ్ల కెరీర్‌లో ఇలాంటి దశలు రావడం సహజమని, ఆ సమయంలో కోహ్లి విషయంలోనూ ఇదే జరిగిందని, దీనికి సంబంధించి సలహా కోరడంతో తనకు తెలిసిన విషయాలను కోహ్లితో షేర్ చేసుకున్నానని అన్నాడు.
నాటి నుంచి కోహ్లి తన కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకున్నాడని, గత దశాబ్దం కాలంగా అతడి ఆటతీరు చూడముచ్చటగా ఉందని, అతడిని చూస్తుంటే నన్ను నేను యువకుడిగా ఉన్నప్పుడు చూసుకున్నట్టు ఉంటుందని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లతో తనకు తెలిసిన విషయాలు పంచుకోవడంలో నేనెప్పుడూ ముందుంటానని సచిన్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.
ఇదిలా ఉంటే, గత కొద్దికాలంగా కోహ్లి ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం అందరికీ తెలిసిందే. అతను సెంచరీ సాధించి రెండేళ్లు దాటిపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో కోహ్లి ఓ సారి సచిన్‌ను కలవాలని, మునుపటి ఫామ్‌ను అందుకునేందుకు మాస్టర్ బ్లాస్టర్ సలహాలు తీసుకోవాలని అతని అభిమానులతో పాటు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కూడా సూచించాడు.
చదవండి: రాకెట్ వేగంతో దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్
Comments
Please login to add a commentAdd a comment