భారత స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. కుటుంబంతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడు అకాయ్‌ను కోహ్లి ఎత్తుకున్న వీడియో వైరల్ అవుతోంది.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను విజేతగా నిలపడంలో కోహ్లి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అమెరికా వేదికగా లీగ్ మ్యాచ్‌లలో తేలిపోయినా.. వెస్టిండీస్‌లో జరిగిన ఫైనల్లో ఈ రన్‌మెషీన్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
బార్బడోస్‌లో టైటిల్ కోసం సౌతాఫ్రికాతో జరిగిన పోరులో ఈ ఓపెనర్ 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేసిన వేళ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(31 బంతుల్లో 47 రన్స్)తో కలిసి టీమిండియాకు భారీ స్కోరు అందించాడు.
ఇక భారత్ విధించిన 177 పరుగుల లక్ష్మాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా తడబడటంతో ట్రోఫీ రోహిత్ సేన సొంతమైంది. ఏడు పరుగుల స్వల్ప తేడాతో ప్రొటిస్ జట్టుపై గెలిచిన టీమిండియా ఖాతాలో ఐదో ఐసీసీ టైటిల్ చేరింది.
ఈ మ్యాచ్ ముగియగానే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. విజయోత్సవాల కోసం జట్టుతో పాటు స్వదేశానికి తిరిగి వచ్చాడు. అనంతరం లండన్ వెళ్లిపోయాడు.
కాగా కోహ్లి భార్య అనుష్క శర్మ తమ పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి అంతకంటే ముందే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో కుటుంబాన్ని కలుసుకున్న కోహ్లి ప్రస్తుతం వారితో సరదాగా సమయం గడుపుతున్నాడు.
ఈ నేపథ్యంలో కోహ్లి.. చిన్నారి అకాయ్‌ను ఎత్తుకుని ఆడిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, ఇందులో అకాయ్ ముఖం మాత్రం కనబడలేదు. కాగా తమ పిల్లల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు వారిని లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచాలని విరుష్క జోడీ నిర్ణయం తీసుకుంది.
అందుకే ఇంతవరకు వామిక, అకాయ్‌లకు సంబంధించిన ఫొటోలు బయటకు రాలేదు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విరాట్- అనుష్క అకాయ్‌కు లండన్‌లో జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం సెలవుల్లో ఉన్న కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment