ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లి ర్యాంక్ మరింత దిగజారింది. టీ20 వరల్డ్‌కప్-2022లో 4 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లి ర్యాంక్ పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత వారం ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉండిన కింగ్.. తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి 13వ ప్లేస్‌కు పడిపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో పాల్గొనకపోవడం కూడా కోహ్లి ర్యాంక్ పడిపోవడానికి కారణమైంది.
ఇక, న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సుడిగాలి శతకంతో రెచ్చిపోయిన సూర్యకుమార్.. రేటింగ్ పాయింట్లను (890) భారీగా పెంచుకుని అగ్రపీఠాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న మహ్మద్ రిజ్వాన్ (836)కు సూర్యకుమార్‌కు ఏకంగా 54 పాయింట్ల వ్యత్యాసం ఏర్పడింది. భారత్‌తో సిరీస్‌లో హాఫ్‌సెంచరీతో రాణించిన డెవాన్ కాన్వే.. ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో ప్లేస్‌కు పడిపోయాడు.
వీరి తర్వాత మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిల్లీ రొస్సో, ఫించ్. పథుమ్ సిస్సంక, అలెక్స్ హేల్స్, బట్లర్ వరుసగా 4 నుంచి 12 స్థానాల్లో నిలిచారు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 3 స్థానాలు దిగజారి 21వ స్థానంలో, కేఎల్ రాహుల్ రెండు స్థానాలు కోల్పోయి 19వ ప్లేస్‌లో ఉన్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. లంక స్పిన్నర్ హసరంగ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. రషీద్ ఖాన్, ఆదిల్ రషీద్ వరుసగా 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా నుంచి టాప్-10 బౌలర్లలో ఒక్కరూ లేకపోవడం చింతించ దగ్గ విషయం. ఆల్‌రౌండర్ల విభాగంలో బంగ్లా స్కిప్పర్ షకీబ్ టాప్‌లో కొనసాగుతుండగా.. మహ్మద్ నబీ, హార్ధిక్ పాండ్యా 2, 3 ప్లేస్‌ల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment