గత రెండేళ్లుగా నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా చలామణి అవుతున్న టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్‌లో తాజాగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (15) గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా స్కై ఈ రికార్డు నెలకొల్పాడు.
విరాట్‌కు 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచ్‌లు అవసరమైతే.. స్కై కేవలం 64 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో స్కై, విరాట్ తర్వాత విరన్‌దీప్ సింగ్ (14), సికందర్ రజా (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ మెరుపు అర్దశతకం (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచున్నాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
నిప్పులు చెరిగిన బుమ్రా..
182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment