
Sehwag Prediction On Asia Cup 2022 Winner: ఆసియా కప్ 2022 విజేత ఎవరనే విషయమై టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సూపర్-4 మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 6) శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓడితే.. దాయాది పాకిస్తాన్‌కు ఆసియా కప్ ఎగరేసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ భారత అభిమానులకు మింగుడుపడని జోస్యం చెప్పాడు. ఆసియా కప్‌లో చాలాకాలం తర్వాత పాక్ టీమిండియాపై విజయం సాధించిన వైనాన్ని బట్టి చూస్తే.. దాయాదికే ఆసియా ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేని వ్యాఖ్యలు చేశాడు.
సెహ్వాగ్ జోస్యం విషయం అటుంచితే.. శ్రీలంకతో నేడు జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైతే ఫైనల్‌కు చేరే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయే మాట వాస్తవమే. ఇదే జరిగితే, సూపర్-4 టేబుల్ టాపర్‌గా శ్రీలంక, మరో మ్యాచ్ ఓడినా టేబుల్ సెకెండ్ టాపర్‌గా పాకిస్తాన్ ఫైనల్స్‌కు చేరతాయి. బలాబలాల విషయంలో లంకతో పోలిస్తే పాక్‌దే పైచేయిగా ఉండటంతో ఫైనల్లో పాక్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.
ఒకవేళ ఇవాల్టి మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో గెలిస్తే.. సమీకరణలు ఇందుకు విరుద్దంగా మారతాయి. రోహిత్ సేన లంకపై గెలిస్తేనే సరిపోదు, మరో సూపర్-4 పోరులో ఆప్ఘనిస్తాన్‌ను కూడా భారీ తేడాతో మట్టికరిపించాల్సి ఉంటుంది. టీమిండియా ఫైనల్స్‌కు చేరేందుకు రన్ రేట్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదంటే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ భారీ విజయాలు సాధించాల్సి ఉంది.
ఈ రెండు విజయాలు ఇచ్చే ఊపుతో అలాగే సూపర్-4 దశలో పాక్ చేతిలో ఎదురైన చేదు అనుభవం తాలూకా కసితో టీమిండియా ఫైనల్లో ఎంతటి ప్రత్యర్ధినైనా మట్టికరిపించే అవకాశం ఉంటుంది. మరోవైపు పాక్ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. వచ్చే ఆదివారం జరుగబోయే ఫైనల్లో దెబ్బతిన్న బెబ్బులి భారత్‌ను ఢీకొట్టాల్సి ఉంటుంది.
ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గ్రూప్ దశలో లంక, బంగ్లా జట్లకు షాకిచ్చిన ఆఫ్ఘాన్.. తమ తదుపరి సూపర్-4 మ్యాచ్‌ల్లో భారత్, పాక్‌లతో తలపడాల్సి ఉంది. ఆఫ్ఘాన్.. ఈ రెండు జట్లలో ఏదో ఒకదానికి షాకిచ్చినా ఫైనల్ బెర్తులు తారుమారవుతాయి. ఏదిఏమైనప్పటికీ ఇవాల్టి మ్యాచ్‌లో లంకను మట్టుబెట్టడమే భారత్ ముందున్న ప్రధమ లక్ష్యం.
చదవండి: IND VS SL: లంకతో అంత ఈజీ కాదు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..?
Comments
Please login to add a commentAdd a comment